దేశ ఆస్తులను కార్పోరేట్ సంస్థలకు ప్రధాని మోడీ కట్టబెడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
హైదరాబాద్:లౌకిక భావాలు కలిగిన నాయకత్వం దేశానికి కావాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.ఆదివారం నాడు తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించారు. ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టే పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో నెహ్రు నాయకత్వం దేశానికి లేకపోతే ఈ రోజున దేశం ఏ పరిస్థితిలో ఉండేదోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.టెక్నాలజీ సహయంతో దేశాన్ని గొప్పగా తీర్ధిదిద్దడంలో నెహ్రు ముందున్నారని ఆయన గుర్తు చేశారు. నెహ్రును ఆదర్శంగా తీసుకొని పాలన చేయాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క కేంద్ర పాలకులకు సూచించారు.
దేశ సంపదను ప్రధాని మోడీ తన మిత్రులకు దోచిపెడుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశాన్ని ధనిక , పేద వర్గాలుగా విభజిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కృష్ణానది జలాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
also read:లక్ష్యసాధన వైపు సాగాలి: కేసీఆర్ సర్కార్‌పై అసెంబ్లీలో భట్టి ఫైర్
తమకు సంబంధించిన పెట్టుబడిదారులకు ఈ దేశాన్ని కట్టబెడుతున్నారని మోడీపై భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. పేదలపై ప్రధాని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. బహుళ జాతి సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ. 11 లక్ష కోట్ల మాఫీ చేసిందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కార్పోరేట్ల చేతిలో పెడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. మోడీకి సైంటిపిక్ ఆలోచన లేదన్నారు. కరోనా వస్తే చప్పట్లు సలహా ఇచ్చారన్నారు. ప్రభుత్వ సంస్థలన్నీ విక్రయిస్తున్నారని బట్టి విక్రమార్క విమర్శించారు.