ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఏర్పడిందో ఆ లక్ష్య సాధన దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు.
హైదరాబాద్:బడ్జెట్ ద్వారా తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నెరవేరాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం నాడు అసెంబ్లీలో ప్రసంగించారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ కోసం అందరూ పోరాటం సాగించిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. తెలంగాణలో సాగుతున్న పోరాటం గురించి తెలుసుకున్న సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లక్ష్యాల్లో నిరుద్యోగం ఒక పెద్ద సమస్య అని ఆయన చెప్పారు..
దశాబ్దాలుగా పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామన్నారు. ఏ లక్ష్యాల కోసం సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ సాగాలనే ఆకాంక్షను భట్టి విక్రమార్క వ్యక్తం చేశారు. భావోద్వేగాల కారణంగా లక్ష్యం నుండి పక్కకు తప్పుకోవద్దన్నారు. ఈ విషయమై తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని భట్టి విక్రమార్క సూచించారు.
ప్రతి మండలంలో మూడు కేజీ టూ పీజీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. విద్యరంగానికి నిధులను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పోడు భూముల పంపకానికి సంబంధించి తేదీలను ప్రభుత్వం త్వరగా ప్రకటించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. పంచాయితీ నిధులపై ఫ్రీజింగ్ పెడుతున్నారన్నారు. ఇది సరైంది కాదని భట్టి విక్రమార్క చెప్పారు.
జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వాలని ఆయన కోరారు. పత్తి రైతులను ఆదుకొనేందుకు చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు 100 గజాల స్థలం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని సీఎల్పీ నేత ప్రభుత్వాన్ని కోరారు. వీఆర్ఏలకు వేతనాలు , సర్పంచ్ లకు నిధులను విడుదల చేయాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
also read:తెలంగాణపై కేంద్రం పగబట్టినట్టుగా వ్యవహరిస్తుంది: శాసనమండలిలో మంత్రి కేటీఆర్
సంగారెడ్డి రాంమందిర్ నుండి సదాశివపేటవరకు మెట్రో రైలును పొడిగించాలని భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఏర్పడితే అందరి ఆశయాలు నెరవేరుతాయని భావించామన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.