సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ఇవాళ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. అనుచరులతో చర్చించిన తర్వాత కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత ఇస్తానని తుమ్మల నాగేశ్వరరావు భట్టి విక్రమార్కకు చెప్పారు.
ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.ఆదివారంనాడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
విలువలతో రాజకీయం చేసే వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు అని ఆయన చెప్పారు. ప్రజా జీవితంలో ఉండి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు అని ఆయన కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరినట్టుగా తెలిపారు.తన మిత్రులు, అనుచరులతో మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం చెబుతానని తుమ్మల నాగేశ్వరరావు తనకు వివరించారన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉండడం జిల్లా వాసులకు గర్వకారణమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మనసతత్వానికి తన మనసతత్వానికి దగ్గర సంబంధం ఉంటుందన్నారు.తనకు వచ్చిన అవకాశాలను ప్రజల కోసం ఉపయోగించే వ్యక్తి భట్టి విక్రమార్క అని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తనకు అత్యంత ఆప్తుడు భట్టి విక్రమార్క అని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. తనను కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించిన సీఎల్పీ నేతకు తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. తన అనుచరులు, అభిమానాలు, సహచరుల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ విషయమై తాను తన అభిప్రాయాన్ని చెబుతానని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
also read:తుమ్మల నాగేశ్వరరావుతో మల్లుభట్టి విక్రమార్క భేటీ: కాంగ్రెస్‌లోకి ఆహ్వానం
బీఆర్ఎస్ నాయకత్వంపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేరాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరడానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతుంది. తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమౌతున్నవారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన క్షేత్రస్థాయి ప్రజా ప్రతినిధులున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. ఈ పరిణామాలను చూస్తే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.