హైద్రాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంపై కేంద్రం పగబట్టినట్టుగా వ్యవహరిస్తుందన్నారు.
హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం పగబట్టినట్టుగా వ్యవహరిస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.తెలంగాణ శాసనమండలిలో మంత్రి కేటీఆర్ ఆదివారంనాడు ఈ వ్యాఖ్యలు చేశారు. హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. బీహెఈఎల్ నుండి లక్డీకపూల్ వరకు 24 కి.మీ , నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో విస్తరణ పనుల కోసం నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా కూడా కేంద్రం నుండి స్పందన లేదన్నారు.
ఈ విషయమై గత ఏడాది సెప్టెంబర్ మాసంలోనే కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ ను సమర్పించినట్టుగా చెప్పారు. ఈ బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు నిధులు కోరామన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు గాను అపాయింట్ మెంట్ కోరితే స్పందించడం లేదన్నారు. అయినా కూడా మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ కేంద్ర ప్రభుత్వంలోని అధికారులను కలిసి నిధుల కోసం వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
బెంగుళూరు మెట్రో రెండో దశ రూ. 59 వేల కోట్లతో ప్రారంభించనున్నారన్నారు. ఈ నిధుల్లో 20 శాతం ఈక్విటీ రూపంలో , మరో 21 శాతం సావరీన్ గ్యారంటీ రూపంలో కేంద్రం అందిస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. చెన్నైలో కూడ మెట్రో రెండో ఫేజ్ రూ. 16 వేల కోట్లు , సావరీన్ గ్యారంటీ కింద రూ. 42 వేల కోట్లు
కేంద్రం అందిస్తుందని కేటీఆర్ వివరించారు.
also read:తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మెన్: బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో, వారణాసి, గోరఖ్ పూర్ , ఆగ్రా, కాన్పూర్, ఆలహబాద్ లలోని మెట్రో ప్రాజెక్టులకు కూడా కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. గుజరాత్ గాంధీనగర్ లో మెట్రో కు కూడా కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయాన్ని కేటీఆర్ మండలిలో గుర్తు చేశారు. కానీ హైద్రాబాద్ మెట్రోకు నిధులు ఇవ్వలేదన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా తాము హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ నిర్మాణాన్ని ఆపడం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.