తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న వీడియోను యువతి విడుదల చేసింది.
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున 18 ఏళ్ల యువతి షాలినిని కారులో వచ్చిన వ్యక్తులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను ఇష్టపూర్వకంగానే వెళ్లినట్టుగా యువతి షాలిని చెప్పింది. పెళ్లి దుస్తుల్లో ఉన్న వీడియోను కూడా విడుదల చేసింది. తాను జ్ఞానేశ్వర్‌ను పెళ్లి చేసుకున్నట్టుగా తెలిపింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని పేర్కొంది. తనని తీసుకెళ్లింది ప్రేమించిన వ్యక్తేనని చెప్పింది. అయితే అతడు తనను తీసుకెళ్లే సమయంలో మాస్కు ధరించడం వల్ల గుర్తుపట్టలే కపోయానని తెలిపింది.
తాము నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని తెలిపింది. ఏడాది క్రితమే తాము పెళ్లి చేసుకున్నామని.. అప్పుడు మైనర్ కావడంతో పెళ్లి చెల్లలేదని చెప్పింది. తన తల్లిదండ్రులు కేసు పెట్టి తనను ఇంటికి తీసుకెళ్లారని.. ఆయనను జైలుకు పంపించారని తెలిపింది. కులాలు వేరుకావడంతో పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తెలిపింది. తన తల్లిదండ్రుల నుంచి ప్రాణభయం ఉందని పేర్కొంది.
వివరాలు.. సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం మూడేపల్లె గ్రామంలో తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో షాలిని, ఆమె తండ్రి ఆలయానికి వెళ్తుండగా కారులో వచ్చిన వ్యక్తులు ఆమెను తీసుకొని వెళ్లిపోయారు. కిడ్నాప్ చేసిన వ్యక్తులు షాలిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై షాలిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకరు బాలిక గ్రామానికి చెందిన వారని తెలిపారు. వారు షాలిని తీసుకెళ్లే ముందు తనపై దాడి చేసినట్టుగా ఆరోపించారు. దీంతో అందరూ షాలిని కిడ్నాప్ అయిందని భావించారు.
ఇక, ఈ ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్.. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కిడ్నాప్ చేసిన నిందితులను సాయంత్రంలోగా పట్టుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఉపేక్షించవద్దని సూచించారు. అయితే తాను కిడ్నాప్ కాలేదని.. ప్రేమించిన వ్యక్తే తనను తీసుకెళ్లాడని.. పెళ్లి కూడా చేసుకున్నామని షాలిని ట్విస్ట్ ఇచ్చింది.
అయితే స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. కొద్ది నెలల క్రితం షాలిని, జ్ఞానేశ్వర్ ఇద్దరు కలిసి పారిపోయారు. అయితే వారికి పోలీసులు కౌన్సెలింగ్ చేసి యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే సోమవారం యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైనట్లు అనుమానం వచ్చిన జ్ఞానేశ్వర్ ఆమెను కిడ్నాప్ చేసేందుకు అతడి స్నేహితులతో కలిసి పథకం రచించాడు. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున ఆమెను తీసుకెళ్లి.. పెళ్లి చేసుకున్నాడు.