
Bodige Shobha's husband dead : చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ భర్త గాలన్న మృతి చెందారు. పీపుల్స్ వార్ మాజీ నాయకుడైన ఆయన.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాని కోసం ఆయన కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు.
కాగా.. అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంత గ్రామమైన సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి కు ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు తీసుకెళ్లారు. గాలన్న మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గాలన్న తన చిన్నతనం నుంచే ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేశారని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా పని చేసిన శోభకు ఆయన అండగా ఉండేవారని తెలిపారు. గాలన మరణం తీరని లోటని పేర్కొన్నారు.
బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా గాలన్న మృతి పట్ల స్పందించారు. బొడిగె గాలన్న మరణం తీరని లోటు అని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ ఆయన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు.