చైనాలో తెలుగు సాహితీ సదస్సుకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ఆహ్వానం.. షాంఘైలో వేడుకలు

Published : Oct 23, 2026, 04:41 PM IST
China

సారాంశం

China: చైనాలోని షాంఘై నగరంలో తొలిసారిగా నిర్వహించనున్న తెలుగు సాహితీ సదస్సు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహ‌కులు ప‌లువురు ప్ర‌ముఖుల‌ను వేడుక‌కు ఆహ్వానిస్తున్నారు.

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ఆహ్వానం

షాంఘైలోని భారత కాన్సుల్ జనరల్ శ్రీ ప్రతీక్ మాథుర్ ప్రముఖ హిందీ–తెలుగు పండితులు, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఆహ్వానించి, భాషా సాహిత్యాల అభివృద్ధిపై చర్చించారు. కేంద్ర హిందీ సమితి సభ్యుడిగా ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో జరిగిన ఈ సమావేశం, అంతర్జాతీయ వేదికలపై భారతీయ భాషలకు ప్రాధాన్యం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా నిలిచింది.

అక్టోబర్ 24, 25 తేదీల్లో 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సాహిత్యాన్ని విస్తరించాలనే లక్ష్యంతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, షాంఘై తెలుగు సంఘం సంయుక్తంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నాయి. ‘తెలుగు కమ్యూనిటీ ఈవెంట్’ పేరుతో అక్టోబర్ 24, 25 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. షాంఘైలోని నార్డ్ ఆంగ్లియా ఇంటర్నేషనల్ స్కూల్ (NAIS), పుడాంగ్ ఈ వేడుకలకు వేదిక కానుంది. ఈ అంతర్జాతీయ సమావేశం ద్వారా వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను, రచయితలను, సాహితీవేత్తలను ఒకే వేదికపైకి తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఈ సదస్సుకు భారత 13వ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రముఖ కవి, నటుడు డాక్టర్ తనికెళ్ల భరణి, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆహ్వానిత అతిథులుగా పాల్గొననున్నారు. తెలుగు భాషా వైభవం, సాహిత్య సంపద, సంస్కృతీ సంప్రదాయాలను అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేయడానికి ఈ సదస్సు దోహదపడుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.

విశాఖపట్నానికి చెందిన లోక్ నాయక్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు పలు సంస్థలు సహకరిస్తున్నాయి. హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య, సింగపూర్‌కు చెందిన శ్రీ సాంస్కృతిక కళా సారథి, హైదరాబాద్‌కు చెందిన వంశీ ఆర్ట్స్ ఇంటర్నేషనల్‌తో పాటు చైనాలోని వివిధ తెలుగు సంఘాలు కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములవుతున్నాయి.

చైనాలోని షాంఘై, బీజింగ్, షెన్‌జెన్, యివు, హాంగ్‌జౌ, గ్వాంగ్‌జౌ, సుజౌ నగరాల నుంచి తెలుగు భాషాభిమానులు, రచయితలు, పండితులు పాల్గొననున్నారు. ఇతర దేశాల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. మలేషియా నుంచి డాక్టర్ అచ్చయ్య కుమార్ నేతృత్వంలో 15 మంది ప్రతినిధులు హాజరుకానుండగా, అమెరికా నుంచి పది మందికి పైగా సాహితీవేత్తలు పాల్గొననున్నారు. వివిధ దేశాల్లోని తెలుగు ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష సమావేశంతో పాటు జూమ్ ద్వారా వర్చువల్‌గా పాల్గొనే అవకాశాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. భారీ వర్షాలు, ఈదురుగాలులపై ఐఎండీ అలర్ట్
ప్యార‌డైజ్ హోట‌ల్‌కు ఆ పేరు ఎలా వ‌చ్చింది.? సినిమా థియేట‌ర్‌కి రెస్టారెంట్‌కి సంబంధం ఏంటి?