తెలంగాణలో చలి వణికిస్తోంది. ఉదయం 9 గంటల వరకు మబ్బు తెరలు వీడడంలేదు. వేళ్లు కొంకర్లు పోయే చలితో బైటికి రావాలంటేనే భయపడుతున్నారు.
హైదరాబాద్ : తెలంగాణలో గత కొద్ది రోజులుగా చలి పెరుగుతుంది. బుధవారంనాడు ఒక్కసారిగా విపరీతంగా చలి పెరిగింది. ఇది రాగల రెండు మూడు రోజులపాటు ఇలాగే ఉండబోతుందని.. మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు కూడా రోజురోజుకు చలి పెరుగుతోందని చెప్పుకొచ్చింది. మూడు రోజుల తర్వాత ఇంతకుముందు ఉన్నట్టుగా సాధారణ స్థితికి రావచ్చని తెలిపింది. డిసెంబర్ నెల చివరలో చలి తీవ్రత మరోసారి మరింత పెరుగుతుందని, చలితోపాటు చల్లని గాలులు వీస్తాయని తెలిపింది.
ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని సాధారణం కంటే ఒక డిగ్రీ వరకు తక్కువగా నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్ శివారు చుట్టుపక్కల ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పుకొచ్చింది. తెలంగాణలో మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీలు నమోదు అయినట్లుగా తెలిపింది.
undefined
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అస్వస్థత... యశోదా హాస్పిటల్లో అడ్మిట్
రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటున్నట్లు తెలిపింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అత్యల్పంగా పగటిపూట ఉష్ణోగ్రతలు 28° నమోదవుతుండగా.. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 31° నమోదయింది.
సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో 12.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్ లో 12.8, పటాన్చెరులో 13.2, అదిలాబాదులో 13.7, హకీంపేటలో 14.5, హనుమకొండ 15, దుండిగల్ 15.7, రామగుండం 14.6, నిజామాబాద్ 16.5, హైదరాబాద్ 16.6, హయత్ నగర్ 16.6, నల్గొండ 17.4, ఖమ్మం 17, మహబూబ్నగర్ 18.5, భద్రాచలం 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చలిగాలులకు అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవాలని.. వెచ్చని దుస్తులు, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.