కేసీఆర్ విజ్ఞప్తి చేసినా వినడంలేదు... హాస్పిటల్ ముందు అభిమానుల ఆందోళన

By Arun Kumar P  |  First Published Dec 13, 2023, 7:03 AM IST

తనకోసం యశోదా హాస్పిటల్ వద్దకు రావద్దని కేసీఆర్ స్వయంగా విజ్ఞప్తి చేసినా ఆయనను అభిమానించేవారు వినడంలేదు. కేసీఆర్ చూసేందుకు యశోదా హాస్పిటల్ వద్దకు చేరుుకున్నవారు ఏకంగా ఆందోళన చేపట్టారు. 


హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయంతో హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రగతి భవన్ వీడిన ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వుంటున్నారు. ఈ క్రమంలోనే గత గురువారం రాత్రి ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డ ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తుంటి ఎముక విరగడంతో హైదరాబాద్ యశోదా హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. ఇలా కొద్దిరోజులుగా హాస్పిటల్ కు పరిమితమైన కేసీఆర్ ఆరోగ్యంపై బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో తమ ప్రియతమ నాయకున్ని చూసేందుకు యశోదా హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. వారిని హాస్పిటల్ సెక్యూరిటీ 
సిబ్బంది లోపలికి అనుమతించపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంటోంది. 

ఇలా గతరాత్రి కూడా కేసీఆర్ చికిత్స పొందుతున్న హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేసీఆర్ ను కలిసేందుకు వివిధ ప్రాంతాలనుండి భారీగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్ కు తరలివచ్చారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమ అభిమాన నాయకున్ని చూసే అవకాశం కల్పించాలంటూ హాస్పిటల్ ముందే ఆందోళనకు దిగారు. కేసీఆర్ ను చూపించేవరకు తాము ఇక్కడినుండి కదలబోమంటూ అక్కడే కూర్చున్నారు. ఎలాగోలా వారికి నచ్చజెప్పిన పోలీసులు అక్కడినుండి పంపించారు. 

Latest Videos

Also Read  నా కోసం ఎవరూ యశోదా ఆసుపత్రికి రావొద్దు... బెడ్ పై నుంచి కేసీఆర్ సందేశం, సర్జరీ తర్వాత తొలిసారిగా

తన ఆరోగ్య పరిస్థితి, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇతర రోగులకు అసౌకర్యాన్ని దృష్టిలో వుంచుకుని హాస్పిటల్ వద్దకు రావద్దని బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులకు స్వయంగా కేసీఆర్ సూచించారు. ఆపరేషన్ జరిగిన తనకు ఇన్ఫెక్షన్ సోకుతుందనే డాక్టర్లు బయటకు పంపడంలేదు... అందరూ అర్ధం చేసుకోవాలని అన్నారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని... త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటానని అన్నారు. అప్పటివరకు తనను కలిసేందుకు ప్రజలెవ్వరూ హాస్పిటల్ వద్దకు రావద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేసారు.

హాస్పిటల్ బెడ్ పైనుండి బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులకు వీడియో సందేశాన్ని ఇచ్చారు కేసీఆర్. తనపై అభిమానం చూపుతున్న కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గత స్వరంతో చేతులు జోడించి వేడుకున్నారు కేసీఆర్. అయినప్పటికీ కేసీఆర్ చికిత్స పొందుతున్న యశోదా హాస్పిటల్ కు ప్రజల తాకిడి తగ్గడంలేదు.  
 

click me!