
వేసవి ఆరంభంలోనే చికెన్ ధరలు కొండెక్కి కూర్చొన్నాయి. మాంసం ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం రోజు చికెన్ తెచ్చుకోవడానికి మార్కెట్‌కు వెళ్లిన జనాలు.. అక్కడ ధరలను చూసి షాక్ తింటున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలను చూసిన సామాన్యులు చికెన్ తినాలంటేనే భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కిలో చికెన్ (స్కిన్ లెస్) ధర రూ. 300కు పైనే ఉంది. కొన్ని వారాల క్రితం వరకు రూ. 200 లోపే ఉన్న కిలో చికెన్ ధర.. ఇప్పుడిలా పెరగడం చూసి జనాలు షాక్ అవుతున్నారు.
హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే.. ఇక్కడ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కిలో చికెన్ రూ. 175గా ఉంది. అయితే కొన్ని వారాల్లోనే ఈ ధర రూ. 100కు పైగా పెరిగింది. ఇప్పుడు నగరంలో కిలో చికెన్ ధర రూ. 280 క్రాస్ చేసింది. మరోవైపు ఏపీలోని విజయవాడలో కేజీ చికెన్ ధర రూ. 306గా ఉంది. ఇక, ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయలు, వంట నూనెల ధరలతో సతమతమవుతున్న సామాన్యులు.. సండే రోజు సరదాగా చికెన్ తెచ్చుకుందామన్న ధరలు పెరగడంతో ఏం కొనెట్టు లేదని వాపోతున్నారు.
పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావడం.. కోళ్లు చనిపోవడం వంటి కారణాలతో చికెన్ ధరలు పెరుగుతున్నట్టుగా పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పౌల్ట్రీ ఫారాల్లో వినియోగించే దాణా రేటు కూడా గతేడాదితో పోలిస్తే భారీగా పెరగడం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరింతగా పెరగనున్నట్టుగా పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు సరిపడా కోళ్ల సరఫరా లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని వారు అంటున్నారు.