గులాబీ నేత గుండెల్లో గుబులు పుట్టిస్తున్న చపాతీ కర్ర, రోడ్డు రోలర్..

By SumaBala Bukka  |  First Published Nov 17, 2023, 9:23 AM IST

ఓటర్లు ఈజీగా గుర్తించేలా, నిరక్షరాసులు కూడా తేలికగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా గుర్తులు ఇచ్చారు. నిత్యం ఉపయోగించే వస్తువులు, పరికరాలు, యంత్రాలే ఎక్కువగా ఉన్నాయి. 


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ అధికార బిఆర్ఎస్ కి  గుర్తులు ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు నియోజకవర్గాల వారీగా కేటాయించిన గుర్తులు బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు రంగారెడ్డి జిల్లా అధికారులు గుర్తులు కేటాయించారు. వీటికోసం ఓటర్లు ఈజీగా గుర్తించేలా, నిరక్షరాసులు కూడా తేలికగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా గుర్తులు ఇచ్చారు.

వీటిలో.. నిత్యం ఉపయోగించే వస్తువులు, పరికరాలు, యంత్రాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్, కంప్యూటర్, లాప్ టాప్, గ్యాస్ స్టవ్, టీవీ రిమోట్, గ్యాస్  సిలిండర్, బంతి, ఆపిల్, కెమెరా, స్టెతస్కోప్, క్యారం బోర్డ్, కుట్టు మిషన్, ఐస్ క్రీమ్, టార్చ్ లైట్, పెట్రోల్ పంప్, కత్తెర, మైక్,  పల్లకి, బ్యాట్, చెప్పులు, హాకీ స్టిక్, ఉంగరం, గాజులు, టూత్ పేస్ట్, పండ్ల బుట్ట, కుండలతో పాటు జనసేన గుర్తు గాజాగ్లాసును కూడా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు.

Latest Videos

undefined

అయితే నాలుగైదు యేళ్లుగా బీఆర్ఎస్ నేతలు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో చపాతీ కర్ర, రోడ్డు రోలర్ లాంటి గుర్తులు.. తమ పార్టీ గుర్తు కారును పోలి ఉన్నాయని ఓటర్లను గందరగోళంలో పడేసి ఓట్లు చీలేలా చేస్తున్నాయని న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ గుర్తులను  స్వతంత్రులకు గాని, ఇతర పార్టీలకు గాని కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు అందించారు.

Telangana BJP : రేపే బిజెపి మేనిఫెస్టో విడుదల... 'ఇంద్రధనుస్సు' పేరిట ఏడు గ్యారంటీలివే..

దీన్ని ఎన్నికల సంఘం కొట్టివేయడంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిమీద విచారణ చేసిన సుప్రీంకోర్టు.. చపాతి కర్ర, రోడ్డు రోలర్ గుర్తులను కేటాయించవద్దంటూ తాము ఆదేశించలేమంటూ ఈ అక్టోబర్ లో తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యుగ తులసి పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని..  తమకు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలంటూ ఆశ్రయించింది. వారి అభ్యర్థనను పరిశీలించిన ఎన్నికల సంఘం ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట మాత్రమే ఆ గుర్తు ఇస్తామని.. యుగ తులసి పార్టీ పోటీలో లేని చోట వేరే వారికి కేటాయిస్తామని ప్రకటించింది.

ఇప్పుడు రోడ్డు రోలర్, చపాతీ కర్ర గుర్తులను దక్కించుకున్న అభ్యర్థులు  ఏఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారంటే…

యుగ తులసి పార్టీ అభ్యర్థులు ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి కల్వకుర్తి నియోజకవర్గం పోటీ చేస్తుండగా.. వీరికి ఇక్కడ రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు. రోడ్డు రోలర్ గుర్తును రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న  మహమ్మద్ అబ్దుల్ అజీజ్ కు, స్వతంత్ర అభ్యర్థులుగా షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో పోటీకి దిగుతున్న నరసింహ,  తుడుము పాండులకు  కేటాయించారు.

అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థులుగా ఎల్బీనగర్ ఇబ్రహీంపట్నం కల్వకుర్తి నియోజకవర్గాల్లో పోటీకి దిగుతున్న వారికి రోడ్డు రోలర్, చపాతీ కర్ర గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది.  తెలంగాణలో జనసేన నేరుగా పోటీకి దిగకపోయినప్పటికీ గాజు గ్లాసు గుర్తు  వారినీ ఇరకాటంలో పెట్టనుంది. స్వతంత్రులుగా శేరిలింగంపల్లి,  మహేశ్వరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న రాజమహేంద్ర కటారి,  సుబ్రహ్మణ్య రాహుల్ లకు, కల్వకుర్తిలో ఎస్ యుసిఐ పార్టీ అభ్యర్థులకు  ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 

click me!