
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పక్కనే ఉన్న కైత్లాపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి కమిటీ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆయన కుటుంబానికే సొంతం కాదని, ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆస్తి అని స్పష్టం చేశారు. తన జన్మని తెలుగు జాతికి అంకితం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు కీర్తించారు.తెలుగు జాతి వున్నంతకాలం ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో వుంటారనీ, ప్రపంచ వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ఎన్టీఆర్ కి నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు.
ఆయన పల్లెలో పుట్టి కష్టపడి ఎదిగిన నేత అనీ, ఎన్టీఆర్ నిస్వార్థ, నీతిపరుడైన నేత అని అన్నారు. రాయలసీమలో కరువు వస్తే జోలెపట్టి ప్రజలకు సహాయం చేసిన మహనీయుడనీ, దివిసీమ ఉప్పెన వస్తే తన తోటి వారిని ఒక్కతాటి పైకి తెచ్చి ప్రజలను ఆదుకున్న నాయకుడని ప్రశంసించారు. తెలుగుజాతికి సేవ చేయాలని తెదేపా పెట్టారనీ, ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవమని అన్నారు. న్టీఆర్ పుట్టినరోజైన మే 28వ తేదీని అమెరికాలో 'తెలుగు హెరిటేజ్ డే'గా ప్రకటించారని, తెలుగు జాతికి ఎన్టీఆర్ తీసుకువచ్చిన గుర్తింపుకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని అన్నారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదనీ, ఆయన మహా శక్తి అని అన్నారు. ఎన్టీఆర్ ఒక స్ఫూర్తిని, తెలుగుజాతి ఖ్యాతన్నారు
ఓ శ్రీకృష్ణుడిగా, రాముడిగా, ఇతర పాత్రలను కూడా భవిష్యత్తులో మరెవ్వరూ చేయలేనంత ప్రతిభావంతంగా నటించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మానవత్వం మూర్తీభవించిన వ్యక్తనీ, తనను 40 ఏళ్ల పాటు ఆదరించిన ప్రజల కోసం రాజకీయ పార్టీ పెట్టాడని అన్నారు. ఇవాళ దేశంలో అమలవుతున్న అనేక సంస్కరణలకు ఆద్యుడిగా ఎన్టీఆర్ నిలిచిపోతారని వివరించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా బ్రాహ్మణి, వసుంధర, వామపక్ష నేత సీతారాం ఏచూరి, మురళీమోహన్, జయప్రద, జయసుధ, అల్లు అరవింద్, అశ్వినీదత్, విజయేంద్రప్రసాద్, వెంకటేశ్, తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్, కర్ణాటక అగ్రహీరో శివరాజ్ కుమార్, బాబూమోహన్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకల ప్రారంభం వేళ వేదికపై ఉన్న ఎన్టీఆర్ ప్రతిమకు ప్రముఖులు నివాళులు అర్పించారు.