తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రావాలి : చంద్రబాబు నాయుడు

By Mahesh Rajamoni  |  First Published Mar 30, 2023, 1:00 PM IST

Hyderabad: తెలంగాణలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) కి పూర్వ వైభవం రావాలని ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. దీనికి కోసం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చురుగ్గా ప‌నిచేయాలని పిలుపునిచ్చారు. 


TDP national president Nara Chandrababu Naidu: తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పార్టీని పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10 కోట్ల మంది పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో భాగస్వాములు కావాలని తాను కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు. అయితే, తెలంగాణాలో దాదాపు తెలుగు దేశం పార్టీ క‌నుమ‌ర‌గ‌య్యే ప‌రిస్థితులు ఉన్న త‌రుణంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. 

తెలుగు దేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో చంద్ర‌బాబు మాట్లాడారు. "తెలంగాణ ప్రజలకు టీడీపీ చారిత్రక అవసరం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఆస్తులు సృష్టించి వాటిని పేదలకు పంచుతామని" ఆయ‌న అన్నారు. తెలంగాణలో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో టీడీపీ అధినేత వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 2014 ఎన్నికల్లో 15 సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుచుకోగా, ఆ తర్వాత 2018 రాష్ట్ర ఎన్నికల్లో (కాంగ్రెస్ తో పొత్తులో) కేవలం రెండు ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే, రాష్ట్రంలో టీడీపీ పుంజుకుంటుందనే విష‌యంపై రాజకీయ పండితులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Latest Videos

రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు ఇది అని గుర్తు చేసిన పార్టీ అధినేత, స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగువారి అభ్యున్నతి కోసమే టీడీపీని స్థాపించారని చంద్ర‌బాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నుంచి టీడీపీ పుట్టిందన్నారు. విద్యావంతులు రాజకీయాల్లో ఉండాలని కోరుకున్నది స్వర్గీయ ఎన్టీఆర్ అని, తద్వారా ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర గ్రాడ్యుయేట్లు రావాల‌ని కోరుకున్నారని చెప్పారు. 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉండేది..? ఇప్పుడు ఎలా ఉందని ప్రశ్నించిన చంద్రబాబు, ప్రజల జీవనశైలిలో ఇంత పెద్ద మార్పు తెచ్చింది ఐటీ పరిశ్రమే అని అన్నారు. సైబరాబాద్ తో పాటు హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి టీడీపీ నాయ‌క‌త్వంలోని తాము కృషి చేశామ‌ని చంద్రబాబు చెప్పారు. దేశంలో మొబైల్ ఫోన్లను ప్రవేశపెట్టాలని తాను కోరినప్పుడు ప్రజలు తనను చూసి నవ్వారని, కానీ నేడు సెల్ ఫోన్ లేకుండా ఎవరూ తమ‌ జీవితాన్ని గడపడం లేదని ఆయన అన్నారు.

click me!