తెలంగాణలో టీడీపీ ఎక్కడ అనేవారికి సమాధానం అదే.. ఇక్కడి ప్రజలు పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు: చంద్రబాబు

Published : Feb 26, 2023, 01:44 PM ISTUpdated : Feb 26, 2023, 07:44 PM IST
తెలంగాణలో టీడీపీ ఎక్కడ అనేవారికి సమాధానం అదే.. ఇక్కడి ప్రజలు పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు: చంద్రబాబు

సారాంశం

తెలంగాణలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. 

తెలంగాణలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడుతో పాటు టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించేముందు.. ఇటీవల మరణించిన తారకరత్నకు సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి ఒక్కరు టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడ ఉందో కనిపిస్తోందని అన్నారు. 

ఎన్టీఆర్ తెలంగాణ గడ్డమీదనే టీడీపీని ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారని అన్నారు. 41 ఏళ్లుగా టీడీపీ తెలుగువారి కోసం పనిచేస్తుందని చెప్పారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనేనని చెప్పారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఎన్టీఆర్.. పేదవారికి భూమిని ఇచ్చారని  అన్నారు. భూమి శిస్తు రద్దు చేసి రైతుకు లాభం కలిగించారని చెప్పారు. యువత, మహిళలకు టీడీపీ పెద్దపీట వేసిందని అన్నారు. 

హైదరాబాద్‌ను ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దిన  ఘనత టీడీపీదేనని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా  హైదరబాద్‌లో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత టీడీపీదేనని తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో పార్టీ  బలోపతం అవుతోందని చెప్పారు. సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం, అభివృద్ది చేయడం, సృష్టించిన సంపదను పేదవారికి పంచడమే టీడీపీ ధ్యేయం అని అన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్న వారికోసం టీడీపీ పనిచేస్తుందని చెప్పారు. 

తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉందని అనేవారికి ఖమ్మం సభ తర్వాత సమాధానం దొరికిందని అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని  అన్నారు. సమిష్టిగా కృషిచేసి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు  సూచించారు. ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే పార్టీ గౌరవిస్తుందని అన్నారు. 

నేతల చుట్టూ తిరగడం కాదు.. ప్రజల్లో ఉండాలని సూచనలు చేశారు. మే 28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం అందరూ పునరంకింత కావాలని పిలుపు ఇచ్చారు. ఆయనకు భారతరత్న రావాలనేది తెలుగువాడి ఆకాంక్ష అని, అది దేశానికి గౌరవం అని వివరించారు. తెలంగాణలో ఇంటింటికి వెళ్లి పార్టీ విశిష్టతను తెలియజేయాలని కోరారు. వృత్తి సంఘాలు, కుల సంఘాలను టీడీపీ బలపరిచేలా చూడాలని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే