నా కూతురిది ఆత్మహత్యాయత్నం కాదు: కేఎంసీ మెడికో ప్రీతి తండ్రి సంచలన ఆరోపణ

Published : Feb 26, 2023, 12:57 PM IST
నా కూతురిది ఆత్మహత్యాయత్నం కాదు: కేఎంసీ మెడికో ప్రీతి తండ్రి సంచలన ఆరోపణ

సారాంశం

కాకతీయ మెడికల్ కాలేజ్‌లో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి  తెలిసిందే.

కాకతీయ మెడికల్ కాలేజ్‌లో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి  తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి ప్రాణాలతో పోరాడుతుంది. అయితే తాజాగా ఈ ఘటనపై ప్రీతి తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తమ కూతురిది ఆత్మహత్య యత్నం కాదని.. హత్య చేయాలని చూశారని ఆరోపించారు. ప్రీతి మాట్లాడిన ఆడియోలు వింటే.. ఆమెను ఎంతగా  వేధించారో అర్ధమవుతుందని అన్నారు. తమతో ప్రీతి మాట్లాడిన తర్వాత హత్యాయత్నం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తనతో ఫోన్ మాట్లాడే సమయంలో కూడా ప్రీతి భయపడుతూనే ఉందని చెప్పారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

ఇదిలా ఉంటే.. తనపై జరుగుతున్న వేధింపుల గురించి ప్రీతి తన తల్లికి వివరించిన ఆడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో ప్రీతి తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను తల్లికి చెప్పుకుని బాధపడింది. సైఫ్ తనతో పాటు చాలా మంది జూనియర్‎లని వేధిస్తున్నాడని ప్రీతి  తెలిపింది. సీనియర్లు అంతా ఒకటేనని తెలిపింది. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినప్పటికీ లాభం లేకుండా పోయిందని తెలిపింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని పేర్కొంది.ఒక వేళ నేను సైఫ్‎పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటైపోయి నన్ను దూరం పెడతారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ సమయంలో ప్రీతికి ఆమె తల్లి ధైర్యం చెప్పింది. 

ఇదిలా ఉంటే..హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ రోజు ఉదయం విడుదల  చేసిన హెల్త్ బులిటెన్‌లో.. ప్రీతి ఆరోగ్యం చాలా  విషమంగా ఉందని తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.  

ఇక, సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. శుక్రవారం సైఫ్‌ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!