గద్దర్ కుటుంబ సభ్యులను టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ పరామర్శించారు. ఈ నెల 6వ తేదీన గద్దర్ మృతి చెందిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: 1997లో గద్దర్ పై కాల్పుల ఘటనపై తనపై తప్పుడు ప్రచారం చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పారు.మంగళవారంనాడు హైద్రాబాద్ లోని అల్వాల్ లో ఉన్న గద్దర్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాల్పుల తర్వాత గద్దర్ తనతో పలుమార్లు మాట్లాడారన్నారు. పేదల హక్కుల పరిరక్షణకు గద్దర్ పనిచేశారని ఆయన గుర్తు చేశారు తాను కూడ పేదల కోసం పనిచేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం గద్దర్ పాటుపడ్డారని గద్దర్ చేసిన సేవలను చంద్రబాబు కొనియాడారు.
భావి తరాలు గద్దర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. హైద్రాబాద్ అభివృద్దికి కారణం ఎవరో ప్రజలకు తెలుసునన్నారు.గద్దర్ ఓ వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని చంద్రబాబు చెప్పారు. ప్రజలను చైతన్యం చేయడంలో గద్దర్ ముందుండేవారన్నారు. తన ఆట, పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేసేందుకు గద్దర్ కృషి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. గద్దర్ కు భయం అంటే తెలియదన్నారు. హైద్రాబాద్ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఈ నెల 6వ తేదీన గద్దర్ మృతి చెందారు. గుండెపోటు కారణంగా గత నెల 20వ తేదీన గద్దర్ హైద్రాబాద్ లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరారు. గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆపరేషన్ విజయవంతమైంది. అయితే ఊపిరితిత్తులు, ఇతరత్రా కారణాలతో గద్దర్ మరణించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో గద్దర్ పై కాల్పులు జరిగాయి.
also read:గద్దర్ పాటలు:నాటి పీపుల్స్ వార్ ఉద్యమానికి ఊతం
నల్లదండు ముఠా ఆయనపై కాల్పులకు దిగిందని అప్పట్లో ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఎలిమినేటి మాధవరెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నారు. గద్దర్ కు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేశారు.ఈ ఆపరేషన్ జరిగిన సమయంలో హోంమంత్రి మాధవరెడ్డి అక్కడే ఉన్నారు. మావోయిస్టు పార్టీలో గద్దర్ సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. మావోయిస్టు పార్టీకి 2012 లో ఆయన రాజీనామా చేశారు.