గద్దర్ పాటలు:నాటి పీపుల్స్ వార్ ఉద్యమానికి ఊతం
1980వ దశకంలో గద్దర్ పాటలతో అనేక మంది యువత పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరారు. పీపుల్స్ వార్ ఉద్యమంలో యువతను ఆకర్షించడంలో గద్దర్ ఆట, పాటలు కీలకంగా వహించేవారు.
హైదరాబాద్: తన ఆట, పాటలతో గద్దర్ 1980వ దశకంలో యువతను ఉర్రూతలూగించారు. అప్పటి పీపుల్స్ వార్ కు అనుబంధంగా జననాట్యమండలి పనిచేసేది. జననాట్యమండలి ద్వారా కళాకారులు గ్రామాల్లో పాటలు, కళారూపాల ద్వారా పీపుల్స్ వార్ భావజాలాన్ని ప్రచారం చేసేవారు. ఆనాడు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమంలో యువత చేరేలా దోహదపడింది. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండేది. వందనాలు వందనాలమ్మో మా బిడ్డల్లారా.. ఆ సమయంలో గద్దర్ పాడిన పాట యువతను విశేషంగా ఆకట్టుకొంది. ఆనాడు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులకు అద్దం పట్టేలా ఆ పాటలుండేవి. గద్దర్ పాటలకు ఆకర్షితులై పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరినట్టుగా లొంగిపోయిన నక్సలైట్లు అనేక మంది చెప్పిన విషయం తెలిసిందే.
also read:ప్రభుత్వంతో చర్చలు: మావోలను అడవి నుండి హైద్రాబాద్ కు తీసుకొచ్చిన గద్దర్
ప్రజల కష్టాలు, బాధల గురించి గద్దర్ పాడిన పాటలు ప్రజలను ఆకర్షించేవి. తన తల్లి బాధను చూసి గద్దర్ రాసిన పాట ఇప్పటికీ కన్నీళ్లను తెప్పిస్తుంది. సిరిమల్లె చెట్టుకింద లచ్చువమ్మో..చిన్నబోయి కూచున్నవెందుకమ్మో... అంటూ ఆయన రాసిన పాట ఆనాటి గ్రామీణ పరిస్థితులకు అద్దం పడుతుంది. ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు చిన్నారిని చూసేందుకు రాలేదని... నిండు అమావాస నాడు ఓ లచ్చగుమ్మడి ఆడపిల్ల పుట్టినాదే ఓ లచ్చ గుమ్మడి అంటూ ఆయన రాసిన పాట ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ ఆయన రాసిన పాట ప్రాచుర్యం పొందింది.