రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అధునాతనమైన మార్కెట్లను నిర్మిస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి లక్షన్నర, రెండు లక్షల జనాభాకు ఆధునాతనమైన సౌకర్యాలతో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.
ఆదివారం నాడు ఉదయం హైద్రాబాద్ నగరంలో మార్కెట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానమిచ్చారు. నగరంలోని చాలా మార్కెట్లు హైజెనిక్ గా లేవన్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మార్కెట్లలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వంద ఏళ్ల క్రితం నిర్మించిన మోండా మార్కెట్ లో పరిస్థితులు చాలా బాగున్నాయని కేసీఆర్ చెప్పారు. మోండా మార్కెట్ ను చూసిన తర్వాత తాను చాలా ఆశ్చర్యపోయినట్టుగా కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కూడా ఇదే తరహలో సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టుగా సీఎం వివరించారు. జిల్లా కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో మోండా మార్కెట్ ను కలెక్టర్లు పరిశీలించిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రస్తావించారు.
undefined
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మిస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మార్కెట్ల నిర్మాణాల గురించి ఆయన వివరించారు. మున్సిపాలిటీకి ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు కేసీఆర్. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు మార్కెట్లను పరిశీలించి అభినందించారు.
కోటి జనాభాకు పైగా ఉన్న హైద్రాబాద్ నగరంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లలో సరైన సౌకర్యాలు లేవన్నారు. అయితే తమ ప్రభుత్వం ఆధునాతనమైన సౌకర్యాలతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మిస్తుందని కేసీఆర్ తెలిపారు.
కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ ఎందుకని కేంద్రం తమను ప్రశ్నించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కేంద్రానికి వివరించి పీడీ యాక్టును ప్రయోగిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ తెలిపారు.