జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై కీలక అడుగు.. కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం..

By Sumanth KanukulaFirst Published Jan 5, 2023, 2:34 PM IST
Highlights

జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీనానికి సంబంధించి అడుగు ముందడుగు పడినట్టుగా కనిపిస్తుంది. కంటోన్మెంట్ సివిల్ ఏరియాల వీలినానికి సంబంధించి కేంద్రం 8 మంది సభ్యులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది.

జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీనానికి సంబంధించి అడుగు ముందడుగు పడినట్టుగా కనిపిస్తుంది. కంటోన్మెంట్ సివిల్ ఏరియాల వీలినానికి సంబంధించి కేంద్రం 8 మంది సభ్యులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖను కూడా పంపింది. ఈ కమిటీకి రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ (ఫైనాన్స్) చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ కూడా సభ్యులుగా ఉండనున్నారు. 

ఇంకా ఆ కమిటీలో రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ (ఎల్ అండ్ డబ్ల్యూ), అదనపు డైరెక్టర్ జనరల్ (కంటోన్మెంట్స్) డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ (DGDE), ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం నుండి అదనపు డీజీ (భూమి, పనుల, పర్యావరణం), డిఫెన్స్ ఎస్టేట్స్ డైరెక్టర్ (సదరన్ కమాండ్, పూణే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు సభ్యులుగా ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా ఉంటారు.

ఈ కమిటీ.. భూమి, స్థిరాస్తులు, కంటోన్మెంట్ బోర్డ్ ఉద్యోగులు,పెన్షనర్లు, కంటోన్మెంట్ నిధులు, పౌర సేవలు, చరాస్తులు, దుకాణాలు, రోడ్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్, రికార్డులను పరిశీలిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఇక, నెల రోజుల్లో పూర్తి నివేదికను సమర్పించాలని కమిటీకి కేంద్రం స్పష్టం చేసింది. 

ఇక, కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదే  పదే  కోరుతుంది. మంత్రి కేటీఆర్ కూడా పలుసార్లు ఇదే విషయంపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్‌తో హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రభావం పడుతుందని కేంద్రానికి విన్నవించారు. ఇక, 2022 డిసెంబర్ 14న తెలంగాణ ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రూపొందించిన ప్రాథమిక నివేదికను కేంద్ర రక్షణ శాఖకు పంపింది. అందులో జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియాల విలీనానికి సూత్రప్రాయ సమ్మతిని తెలియజేసింది.

click me!