కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్: కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన, ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Jan 5, 2023, 1:43 PM IST
Highlights


కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని గురువారంనాడు  రైతులు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు  ప్రయత్నించిన  రైతులను అడ్డుకున్నారు. 
 

నిజామాబాద్: కామారెడ్డి  కొత్త మాస్టర్ ప్లాన్ ను  వెంటనే వెనక్కి తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద  గురువారంనాడు  రైతులు ఆందోళన నిర్వహించారు . కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు  రైతులు  ప్రయత్నించారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది.కామారెడ్డి  మాస్టర్ ప్లాన్  పరిధిలోకి   ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల్లోని రైతుల నుండి భూములను సేకరించి  ఇండస్ట్రీయల్ కారిడార్ కు  కేటాయించనున్నారు. ఈ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు.తమకు జీవనోపాధిని కల్పించే  భూములను ఇవ్వబోమని రైతులు  చెబుతున్నారు.  

also read:కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్: గ్రామ పంచాయితీ పాలక వర్గం రాజీనామా, కలెక్టరేట్ ముట్టడి

తన భూమి పోతోందనే భయంతో రాములు అనే రైతు  నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఎనిమిది గ్రామాల రైతులు  ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని  ఆందోళనకు దిగారు.రైతులు  కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు  ప్రయత్నించడంతో  పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ వద్ద ఏర్పాటు  చేసిన  బారికేడ్లను తోసుకొని  వెళ్లేందుకు ప్రయత్నించారు.కుటుంబాలతో సహా కలిసి  కలెక్టరేట్ ముందు  రైతులు ఆందోళనకు దిగారు.తాము భూములను  వదులుకొనే ప్రసక్తేలేదని  రైతులు చెప్పారు.ఇదిలా ఉంటే  రైతులకు మద్దతుగా  బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు , ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే  రవీందర్ రెడ్డిలు  ధర్నాలో  పాల్గొన్నారు.  

కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన గ్రామపంచాయితీ  ఉపసర్పంచ్  సహా తొమ్మిది మంది  రాజీనామా చేశారు.నిన్న రాములు అనే రైతు  ఆత్మహత్య చేసుకున్నారు. రాములు ఆత్మహత్యతో మరింత ఆందోళన చెందుతున్నారు.  మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకొనేవరకు  తమ ఆందోళన  నిర్వహిస్తామని  రైతులు  తేల్చి చెప్పారు.  మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

తమ భూముల విషయంలో  ప్రభుత్వం నుండి స్పష్టత ఇచ్చేవరకు  ఆందోళన నిర్వహిస్తామని  రైతులు ప్రకటించారు.  కలెక్టరేట్ నుండి వెళ్లేది లేదని  తేల్చి చెప్పారు. కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు  ప్రయత్నిస్తున్నారు.  ఆందోళనకారులు కలెక్టరేట్ లోకి వెళ్లకుండా  పోలీసులు మూడంచెల భద్రతను  ఏర్పాటు  చేశారు.  కలెక్టరేట్ లోనికి  రైతులు వెళ్లకుండా బారికేడ్లను అడ్డుపెట్టి పోలీసులు నిలువరిస్తున్నారు. 

click me!