తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రగతి రథం పేరుతో ఓ బస్సును వినియోగిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలకు ఈ బస్సులోనే ప్రయాణిస్తున్నారు.
కరీంనగర్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు ఎన్నికల సంఘం తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఓటర్లను ప్రలోభాలు పెట్టే ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ చర్యలకు ముఖ్యమంత్రి కూడా మినహాయింపు కాదని నిరూపించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల బలగాలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రచారం కోసం వినియోగిస్తున్న ప్రగతి రథం బస్సును తనిఖీ చేశాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కరీంనగర్ జిల్లా మానకొండూరుకు సోమవారం వెళ్ళనున్నారు. ఈ క్రమంలోనే ఆయన వినియోగిస్తున్న బస్సును కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు చేశాయి. సోమవారం నాడు మానకొండూరులో టిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. దీనికి కేసీఆర్ హాజరవన్నారు. ప్రగతి రథం బస్సు సభా ప్రాంగణానికి వెళుతున్న క్రమంలో కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్గేట్ దగ్గర కేంద్ర బలగాలు ఈ బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.
ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు వెళుతున్న సీఎం కేసీఆర్ ఇవాళ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. నల్గొండ, నకిరేకల్, మానకొండూర్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర బలగాలు తనిఖీలు చేయగా, ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ బలగాలకు సిబ్బంది పూర్తిగా సహకరించారు. ప్రస్తుతమిది చర్చనీయాంశంగా మారింది.