
తెలంగాణకు హై పవర్ కమిటీని పంపాలని అధికారులను ఆదేశించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amit shah) . రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది హై పవర్ కమిటీ. అంతకుముందు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay), రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌లు (tarun chugh) అమిత్ షాను కలిశారు. తెలంగాణలో వరద నష్టంపై వీరిద్దరూ కేంద్ర హోంమంత్రికి వివరించారు. బాధితులను ఆదుకోవాలని బండి సంజయ్ కోరారు.
అంతకుముందు తెలంగాణ ఇటీవల కురిసిన వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజల జన జీవనం అస్తవ్యస్తంగా మారిందని బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో అత్యంత అప్రమత్తంగా ఉండి.. సహాయక కార్యక్రమాలు అందించాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు విలాసాల పేరిట విదేశాలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పర్యటనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వానిది కూడా తప్పేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపం వల్లనే పంప్ హౌజ్ లు మునిగిపోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరాకు నీరు ఇవ్వదానికి 27 వేల రూపాయల కరెంటు ఖర్చు అవుతోందనీ, ఈ ప్రాజెక్ట్ వల్ల లాభం ఉందా ? లేదా? అని మాజీ ఐఏఎస్ అధికారులు అడుగుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు.
ALso Read:క్లౌడ్ బరస్ట్ కామెంట్స్: కేసీఆర్‌కు గవర్నర్ తమిళిసై కౌంటర్..!
గోదావరి పరివాహక ప్రాంత ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయనీ, కేవలం ఒక్క భద్రాచలం మాత్రమే నష్టపోయినట్లు అక్కడివారికి మాత్రమే ఇల్లు కట్టిస్త అని సీఎం చెప్పడం బాధాకరమని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల వల్ల ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయని, ఈ వరదలో Ntv విలేకరి మరణించడం బాధాకరమని అన్నారు. సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు SRSP నుండి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతం అంతా తిరిగి ప్రజలకు అండగా ఉండాల్సి ఉండే కానీ వారి బాధ్యతని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచిర్యాల మునిగిందనీ,గూడు కరువైన వారి గోడు వినడం లేదని అన్నారు. మంథనిలో వేల బస్తాల బియ్యం నీళ్ళ పాలు అయ్యాయనీ, షాపులు అన్నీ నీట మునిగాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు పడయ్యాయి. ఇల్లు మునిగిపోయిన వారందరికీ నష్ట తీవ్రతను అంచనా వేసి ప్రతి ఇంటికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం కెసిఆర్ ఇతరుల మీద నెపం నెట్టి భాధ్యత నుండి తప్పించుకోవద్దని సూచించారు. 1986 తరువాత ఇంత పెద్ద వరద వచ్చిందనీ, ఇప్పుడే కాబట్టి వారిని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరపున మేము కూడా కేంద్రాన్ని కోరామనీ, సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.