
విభజన సమస్యలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్పరెన్స్ నిర్వహించింది. టీఎస్ డిస్కం ద్వారా ఏపీజెన్కోకు విద్యుత్ బకాయిలు చెల్లింపుకు అంగీకారం కుదిరింది. ఏపీ నుంచి తెలంగాణ పవర్ యుటిలిటీస్‌కు రూ.12,111 కోట్ల బకాయిలు వున్నాయని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. టీఎస్‌జెన్కో చెల్లించాల్సిన బకాయిలు రూ.3,442 కోట్లని ఏపీ అంటోందని తెలంగాణ వాదిస్తోంది. సీలేరు హైడ్రో పవర్ ప్లాంట్‌కు సంబంధించి సమస్య పరిష్కారానికి, 2014లో నీరజా మాథుర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని తెలంగాణ గుర్తుచేస్తోంది.
ఏడేళ్లు గడిచినా కమిటీ ఇంకా నివేదిక సమర్పించలేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఏపీ హైకోర్టులో కేసు కూడా వేసిందని వెల్లడించింది. బకాయిలను తేల్చేందుకు వీలుగా కేసును ఉపసంహరించుకోవాలని పేర్కొంది. షెడ్యూల్ 9లోని సంస్థలకు సంబంధించిన వివాదం వుంది. డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీఐఎల్ఎల్)కి కేటాయించిన , మొత్తం 5 వేల ఎకరాల భూమి కేటాయింపు షరతులు ఉల్లంఘించినందున 2015లో తెలంగాణ ప్రభుత్వం తిరిగి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ జీవోపై ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసి స్టే ఆర్డర్ పొందిందని తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పోరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ).. స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ విషయంలో షరతులు ఉల్లంఘించినందుకు కేటాయించిన 250 ఎకరాలను తిరిగి తీసుకున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది. దీనిని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం స్టే తెచ్చుకుంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు కేసుల కారణంగా.. షెడ్యూల్ 9లోని సంస్థల విభజన పెండింగ్‌లో వుందని తెలంగాణ సర్కార్ తెలిపింది.
ఇటు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపైనా కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ భవన్ విభజనపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2 నెలల్లో అధ్యయనం చేసి భవన్ విభజనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీలోని 19 ఎకరాల్లో ఏపీ భవన్ ఆస్తులు వుండగా.. ఏపీ భవన్ విభజనపై మూడు ప్రతిపాదనలు వున్నాయి. విభజన చట్టంలో ఏపీకి 58, తెలంగాణకు 42 నిష్పత్తి ప్రకారం పంపిణీ ఫార్ములాను ప్రతిపాదించారు.