నవ్వుల పాలవుతున్న కేంద్రం

First Published Nov 19, 2016, 3:38 AM IST
Highlights

పెద్ద నోట్ల రద్దు చేయదలచినపుడు ప్రత్యామ్నాయంగా కొద్ది నెలల ముందునుండే చిన్న నోట్ల చెలామణిని పెంచాలన్న కనీస ఇంగితం కూడా కేంద్రప్రభుత్వానికి లేకపోవటం ఆశ్చర్యం.

అనాలోచిత నిర్ణయంతో నవ్వులపాలవుతున్న కేంద్రప్రభుత్వం. పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు రోజుకో నిర్ణయాన్ని  తీసుకుంటూ దేశాన్ని గందరగోళంలో నెట్టేస్తోంది. పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో తలెత్తిన పరిణామాల విషయంలో స్వయంగా సుప్రింకోర్టే ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్ధితి ఎంతగా విషయమించిందో తెలుస్తోంది. నోట్ల రద్దు తర్వాత పరిస్దితులు చూస్తుంటే అల్లర్లకు దారి తీయవచ్చని సర్వోన్నత న్యాయస్ధానం చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవే. వెనుకాముందు ఆలోచించకుండా ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం యావద్భారతదేశాన్ని ఆందోళనలో పడేసింది.

 

దేశంలో కేవలం అతికొద్ది మంది వద్ద ఉన్న నల్లధనాన్ని వెలికి తీయాలని, నకిలీ నోట్ల చెలామణిని అరికట్టాలన్న ఉద్దేశ్యంతో ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ప్రజల్లో అత్యధికులు గడచిన 10 రోజులుగా బ్యాంకుల ముందే క్యూలు కడుతున్నారు. పది రోజులుగా క్యూలు కడుతున్నా సమస్య తగ్గకపోగా మరింత పెరుగుతుండటం గమనార్హం. ఇందుకు కేంద్రప్రభుత్వం రోజుకోరకంగా తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలే కారణం.

 

పెద్ద నోట్ల రద్దు చేయదలచినపుడు ప్రత్యామ్నాయంగా కొద్ది నెలల ముందునుండే చిన్న నోట్ల చెలామణిని పెంచాలన్న కనీస ఇంగితం కూడా కేంద్రప్రభుత్వానికి లేకపోవటం ఆశ్చర్యం. 86 శాతం చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయటంతోనే సమస్యలు మొదలయ్యాయి. కొత్త నోట్లను చెలామణిలోకి తెచ్చేటపుడు తలెత్తబోయే సమస్యలను ముందుగా గ్రహించలేకపోవటం, కొత్త నోట్లను ఏటిఎంల్లో సర్దబాబు చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయన్న కనీస అవగాహన కూడా పాలకుల్లో లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

 

ఒకరోజు బ్యాంకుల నుండి తీసుకునే నగదు పరిమితిని పెంచుతారు. మరోరోజు తగ్గించేస్తారు. ఇంకోరోజు ఏ బ్యాంకులోనైనా ఖాతాదారుడు నగదు తీసుకోవచ్చంటారు. తర్వాతరోజు ఖాతాదారుకు ఏ బ్యాంకులో అయితే ఖతా ఉందో అక్కడే నగదు ఇస్తారంటారు. ఒకరోజు వేలిగుర్తుపై సిరా మార్క్ పెడుతారు. మరుసటి రోజు నిబంధనను ఎత్తేస్తారు. నగదు నిల్వలు సరిపడా ఉన్నాయంటూనే నగదు పరిమితిని తగ్గించటం, నగదు మార్పిడిని ఆపేసే విషయం పరిశీలనలో ఉందంటారు. ఈ విధంగా రోజుకో ప్రకటన చేస్తు ప్రజలముందు కేంద్రం చులకనైపోతోంది.

 

నోట్ల రద్దు చేసినపుడు తెలెత్తిన సమన్యలు రెండు రోజుల్లో సర్దుకుంటుందన్నారు. తరువాత పదిరోజులన్నారు. మళ్ళీ ఏటిఎంలన్నీ సక్రమంగా పనిచేసేందుకు 50 రోజులు పడుతుందని, ప్రజలు సహకరించాలన్నారు. తాజాగా రద్దైన నోట్ల స్ధానంలో కొత్త నోట్లు పూర్తిస్దాయిలో చెలామణిలోకి రావటానికి కనీసం 6 నెలలు పడుతుందని చెబుతున్నారు. నోట్ల రద్దు ప్రకటన చేసిన తర్వాత తలెత్తిన పరిణామాలను అదుపుచేయటంలో ప్రధానమంత్రి పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా పెలుబుకుతున్న జనాగ్రహాన్ని ఏ విధంగా తట్టుకోవాలో అర్ధం కాక రోజుకో నిర్ణయాన్ని అమలు చేస్తూ మొత్తానికి కేంద్రప్రభుత్వం నవ్వులపాలవున్నది మాత్రం స్పష్టం.

click me!