
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్యాజువల్ లీవ్ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంతకంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవం నాడు క్యాజువల్ లీవ్ వర్తించనుంది.
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం మార్చి 8 నుంచి మహిళా వారోత్సవాలను నిర్వహించనుంది. మహిళా శక్తి ప్రాముఖ్యతను, సమాజంలో వారి పాత్రను హైలైట్ చేస్తూ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మంత్రి కెటీఆర్ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ అధికారులు కార్యచరణనను సిద్దం చేశారు.
ఇందులో భాగంగా అధికారులు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రారంభమై వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు సాగనున్నాయి. ఇందుకోసం పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి మహిళా వారోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.