తవ్వినకొద్దీ క్యాసినో కింగ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. యేడాదిలో నాలుగు భారీ క్యాసినో ఈవెంట్లు నిర్వహించినట్లు.. దీనికోసం హవాలా మార్గాన్ని ఉపయోగించినట్లు తేలింది.
హైదరాబాద్ : క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ వ్యాపారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఐదుగురికి నోటీసులు జారీ చేశారు. క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్, మాధవ రెడ్డిలతో పాటు విమానాల ఆపరేటర్ సంపత్ సహా మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రవీణ్, మాధవ రెడ్డి బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.25 కోట్ల లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు.
పలువురు రాజకీయ నాయకులు, అధికారులకు సైతం ప్రవీణ్ మాధవరెడ్డి ఖాతా నుంచి నగదు బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఏడాది వ్యవధిలో నాలుగు భారీ క్యాసినో ఈవెంట్లు నిర్వహించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. గోవా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్ లలో ప్రవీణ్, మాధవరెడ్డి క్యాసినో ఈవెంట్లు నిర్వహించారు . హవాలా మార్గంలో డబ్బులను ఇక్కడి నుంచి తీసుకు వెళ్లినట్లు.. తిరిగి ఇక్కడికి తీసుకు వచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీనికోసం, బేగంబజార్, జూబ్లీహిల్స్ కి చెందిన ఇద్దరు హవాలా ఏజెంట్ల సాయం తీసుకున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనలో అధికారులు పూర్తి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
undefined
జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ర్యాగింగ్ భూతం.. జూనియర్లతో సీనియర్ల అసభ్య ప్రవర్తన...
ఇదిలా ఉండగా, చీకోటి ప్రవీణ్ ఫాంహౌజ్ లో అరుదైన చిలుకలు.. మరోపక్క అంతకన్నా అరుదైన పాములు, ఉడుములు ఊసరవెల్లులు.. ఒకటా రెండా 24 రకాల పక్షులు, జంతువులు.. క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ లో కనిపించే జీవాలు ఇవన్నీ. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డి గూడలో చీకోటికి 12 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. శుక్రవారం అక్కడ తనిఖీలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు ఆదివారం.. ఆ జీవాలను చూసి అవాక్కయ్యారు వాటన్నింటినీ అతడు ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల నుంచి రప్పించినట్లు సమాచారం.
వాస్తవానికి.. చీకటి ఫాంహౌస్లో ఉన్న ఈ జంతువులు, పక్షుల గురించి చాలా కాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతూనే ఉంది. చీకోటి స్వయంగా ఊసరవెల్లితో దిగిన ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. అయినా అటవీశాఖ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు.. చూసీచూడనట్లు ఊరుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారంతా హడావుడిగా రంగంలోకి దిగి మూడు గంటల పాటు తనిఖీలు చేసి వివరాలు సేకరించారు.
ఫాంహౌస్ లో ఉన్న విదేశీ పక్షులు పాములు, జంతువుల గురించి పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. వన్యప్రాణుల పెంపకానికి సంబంధించి గతంలోనే చికోటి అనుమతులు తీసుకున్నాడని అయితే అనుమతి లేని వాళ్ళు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నామని, శనివారం నాటికి తమ విచారణ పూర్తవుతుందని తెలిపారు. కాగా, అతడి వద్ద చాలా అధికంగా ఉన్నాయని వాటికి సంబంధించి, పక్కాగా కేసులు నమోదు చేస్తే అతనికి ఏడేళ్ల జైలు శిక్ష ఖాయమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు.