
నిజామాబాద్ : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో విచిత్రమైన దొంగతనం జరిగింది. ఇటీవల కాలంలో టమాటాల రేట్లు పెరిగిపోవడంతో.. టమాటా దొంగతనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇంట్లో నగదు, బంగారం ఎత్తుకు పోవడానికి వచ్చిన దొంగలు.. ఫ్రిడ్జ్ లోని కిలో టమోటాలను కూడా ఎత్తుకుపోవడం చూసి ఇంటి వాళ్ళు అవాక్కయ్యారు.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వెలుగు చూసింది. పట్నంలోని ఓ ఇంట్లోని వారు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం రాత్రి వారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఆ తర్వాత ఫ్రిజ్లో ఉన్న కిలో టమాటాలను కూడా ఎందుకైనా పనికొస్తాయిలే అని తీసుకెళ్లినట్టున్నారు.
సిద్ధిపేట జిల్లాలో మైనర్ ప్రేమజంట ఆత్మహత్య...
ఇంటికి తిరిగి వచ్చిన బాధితులు.. ఇంట్లో దొంగలు పడడం గమనించి ఏమేం పోయాయో పరిశీలించగా.. ఈ విషయం వెలుగు చూసింది. వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్ ఉద్యోగి రఫీ కుటుంబం బోధనలోని గౌడ్స్ కాలనీలో నివాసం ఉంటుంది. సోమవారం సాయంత్రం వీరంతా ఇంటికి తాళం వేసి సిద్దిపేటలోని బంధువుల ఇంటికి. వెళ్లారు.
మంగళవారం తెల్లవారుజామున తిరిగి వచ్చారు. వారు వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. లోపల అంతా సామాన్లు చిందరవందరగా పడేసి గందరగోళంగా చేసి ఉంది. దొంగలు పడ్డారని నిర్ధారించుకుని… ఏమేం వస్తువులు పోయాయో చూడగా బీరువాలో దాచి ఉంచిన నగదు రూ.1.28లక్షలు, 12 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని గమనించారు.
ఆ తర్వాత ఇల్లు గమనిస్తుండగా ఫ్రిడ్జ్ తలుపు తెరిచి ఉంది. అందులో చూడగా కిలో టమాటాలు కూడా కనిపించలేదు. దీంతో వాటిని కూడా దొంగలే ఎత్తుకెళ్లారని గుర్తించారు. మంగళవారం బాధితులు రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పీటర్, క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగతనానికి సంబంధించిన వివరాలను సేకరించారు.
ఇదిలా ఉండగా, దేశంలో పెరుగుతున్న టమాటా ధరల నేపథ్యంలో అనేక వార్తా కథనాలు వెలుగు చూస్తున్నాయి. టమాటా దొంగతనాలతో సహా.. టమాటాలు లేకుండా వంటకాలు ఎలా చేయాలి.. రెస్టారెంట్లు టమాటాలను ఎలా అవాయిడ్ చేస్తున్నాయి.. ఇలాంటి అనేక కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాలో టమాటాలకు సంబంధించి ఓ వార్త ఆదివారం హల్చల్ చేసింది.
ఓ టమాటాల వ్యాపారి టమాటాలను కాపాడుకోవడం కోసం బౌన్సర్లను నియమించుకున్నట్లుగా పీటీఐ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. దీన్ని అనుసరించి అన్ని మీడియాలు ఈ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అయితే, ఇది తప్పుడు వార్త అని పీటీఐ ఇప్పుడు నాలుక కరుచుకుంది. ఆ వార్తలోని నిజానిజాలు తెలుసుకోవడంలో విఫలమయ్యామని.. క్షమించమని కోరింది.
ఈ మేరకు మొదట తాము చేసిన ట్వీట్ ను డిలీట్ చేసినట్టుగా తెలుపుతూ.. మరో ట్వీట్ చేసింది. ఇలాంటి వార్తని తాము ప్రసారం చేసినందుకు క్షమించాలని కోరింది. ఆ వార్తలో నిజం లేదని తెలిపింది. ఆ టమాటాల షాపు ఓనరు సమాజ్ వాది పార్టీ కార్యకర్త అని గుర్తించినట్లుగా తెలిపింది. అయితే, ఇలా ఫోటో వెనక అతని ఉద్దేశ్యం ఏమిటో ప్రశ్నార్థకంగా ఉందని చెప్పుకొచ్చింది.
పీటీఐ ఎల్లప్పుడూ ఉన్నత ప్రమాణాలను చేరడంలో కృషి చేస్తుందని.. ఈసారి తప్పు జరిగిందని పేర్కొంది. ఉన్నత విలువలతో కూడిన నిష్పాక్షికమైన వార్తలను అందించడానికి పీటీఐ కట్టుబడి ఉన్నట్లుగా హామీ ఇస్తున్నట్లు ట్వీట్ లో తెలిపింది.
దేశంలో టమాటాల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో.. ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సామాన్య జనం టమాటా కొనడానికి విముఖత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు సబ్సిడీ మీద టమాటాలను అందించడం కూడా తెలిసిందే.