జగన్ ఓదార్పు యాత్రనాటి కేసు ఎత్తివేత: కొండా సురేఖకు ఊరట

By telugu teamFirst Published Aug 13, 2020, 8:28 AM IST
Highlights

ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా నమోదైన కేసును ఎత్తివేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం సాగుతోంది. దీంతో కొండా సురేఖతో సహా పలువురు నేతలకు ఊరట లభించనుంది.

మహబూబాబాద్: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా తెలంగాణలో నమోదైన కేసును ఎత్తివేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా మానుకోటలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల ఘటనపై అప్పటి కాంగ్రెసు నాయకులపై కేసు నమోదైంది. ఈ కేసును ఎత్తివేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆ కేసు ఎత్తివేస్తే తెలంగాణ కాంగ్రెసు నాయకులకు కూడా ఊరట లభించనుంది. ఈ కేసులో కాంగ్రెసు నాయకులు కూడా నిందితులుగా ఉన్నారు. జేఏసీ ప్రతినిధి డాక్టర్ డోలి సత్యనారాయణ అప్పట్లో ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వైఎస్ జగన్ 2010 మే 28వ తేదీన మహబూబాబాద్ పర్యటనకు బయలుదేరారు. ఆయనను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జగన్ కు స్వాగతం చెప్పడానికి వచ్చిన ఆయన అనుచరులకు, తెలంగాణ ఉద్యమకారులకు మధ్య ఘర్షణ జరిగింది. దాంతో పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కాల్పుల్లో 13 మంది గాయపడ్డారు. 

అప్పటి కాంగ్రెసు నాయకులు కొండా మురళి, కొండా సురేఖ, భూమా నాగిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పుల్లా భాస్కర్, పుల్లా పద్మావతి, నాయిని రాజేందర్ రెడ్డి, రెడ్యా నాయక్, మాలోతు కవితలపై కేసు నమోదైంది.

ఆ కేసును అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడికి బదిలీ చేసింది. ఆ తర్వాత పదేళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఆ కేసు విచారణను నిలిపేస్తూ మొత్తం కేసులను ఉపసంహరించుకుంటూ ఫిర్యాదు చేసిన డోలి సత్యనారాయణకు సీబీసీఐడీ ఏఎస్పీ నోటీసు పంపించారు. వారం రోజుల్లో వరంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు కావచ్చునని తెలిపింది.

click me!