తెలంగాణలో పెరిగిన ఆహారోత్పత్తి: ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగంపై మంత్రులతో కేటీఆర్ సమీక్షా

By Siva KodatiFirst Published Aug 12, 2020, 10:52 PM IST
Highlights

రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగానికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగానికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై మంత్రి వర్గ సహచరులతో కేటీఆర్ కేబినెట్ స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల తెలంగాణలో జలవిప్లవం వస్తుందన్నారు. లక్షలాది ఎకరాల బీడు భూములు.. కృష్ణా, గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు.

జల విప్లవంతో పాటు నీలి విప్లవం, గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ), శ్వేత విప్లవం (పాడి పరిశ్రమ) కూడా తెలంగాణలో రానున్నాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

సీఎం సూచన మేరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ పంటలు పండుతున్నాయో పూర్తిగా మ్యాపింగ్ చేశామని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరి, పత్తి, మొక్కజోన్న, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి బాగా పెరిగిందని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్ చేసే సామర్ద్యం మనకు లేదన్నారు. అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతాయని, దీంతో ఆహార శుద్ధి రంగ పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వెల్లడించారు.

దీని వల్ల రైతులకు ఆర్ధిక స్వావలంబన, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రతిపాదిస్తున్నామని, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న ప్రోత్సహాకాలను పరిశీలించాలని మంత్రులను కేటీఆర్ కోరారు. 

click me!