ప్రజా భవన్ ముందు కారు బీభత్సం... ఇది బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు పనేనా? 

By Arun Kumar P  |  First Published Dec 26, 2023, 8:14 AM IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో... అదీ డిప్యూటీ సీఎం అధికారిక నివాసం ఎదుట అర్థరాత్రి జరిగిన కారు ప్రమాదానికి ఓ ప్రజాప్రతినిధి తనయుడే కారణమని ప్రచారం జరుగుతోంది. 


హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజా భవన్ (ప్రగతి భవన్) ఓ  కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు అర్ధరాత్రి అతివేగంతో దూసుకొచ్చి ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టింది.  అయితే ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైనా అందులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు.  

అర్ధరాత్రి 2.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రజా భవన్ వద్ద సెక్యూరిటీగా వున్న పోలీసుల ఎదుటే కారు బారికేడ్లను ఢీకొట్టింది. కారులో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు వున్నట్లు సమాచారం. అయితే కారు ప్రమాదం జరగ్గానే ఓ యువకుడు పరారవగా మరొకరిని పోలీసులు పట్టుకున్నారు. అతడికి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించలేదని తేలింది. 

Latest Videos

ఈ ప్రమాదంపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడ్డ అబ్దుల్ ఆసిఫ్(27) ను విచారించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. అలాగే ప్రమాదంలో ధ్వంసమైన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నెంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకుంటున్నారు. 

Also Read  Sunburn: సన్‌బర్న్‌ వివాదం.. బుక్‌ మై షోపై చీటింగ్‌ కేసు నమోదు..

పాలిటిక్స్ కు నిలయమైన ప్రజా భవన్ ముందు జరిగిన ప్రమాదమూ రాజకీయంగా మారింది. నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకే ఈ ప్రమాదానికి కారణమని... ప్రమాద సమయంలో అతడే కారు నడిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ పలుకుబడితో పోలీసులను మేనేజ్ చేసిన షకీల్ కొడుకును కేసునుండి తప్పించినట్లు సమాచారం. ఇలా ఈ యాక్సిడెంట్ వ్యవహారం రాజకీయాలకు దారితీస్తుండటంతో సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

 

click me!