బంటీ & బబ్లీ స్టైల్లో చైన్ స్నాచింగ్

By sivanagaprasad kodatiFirst Published Oct 9, 2018, 1:36 PM IST
Highlights

బాలీవుడ్ హిట్ మూవీ బంటీ అండ్ బబ్లీ సినిమా గుర్తుందా.. అందులో హీరో హీరోయిన్లు కలిసి జనాన్ని బురిడి కొట్టిస్తూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడతారు. ఈ సినిమాని ఇన్సిపిరేషన్‌గా తీసుకున్నారో ఏమో కానీ.. ఒక జంట అచ్చం అదే తరహాలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు చిక్కింది. 

బాలీవుడ్ హిట్ మూవీ బంటీ అండ్ బబ్లీ సినిమా గుర్తుందా.. అందులో హీరో హీరోయిన్లు కలిసి జనాన్ని బురిడి కొట్టిస్తూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడతారు. ఈ సినిమాని ఇన్సిపిరేషన్‌గా తీసుకున్నారో ఏమో కానీ.. ఒక జంట అచ్చం అదే తరహాలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు చిక్కింది.

సూర్యాపేట అప్పన్నపేటకు చెందిన నందిపాటి వినోద్ డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. పెళ్లైన తర్వాత ఉపాధి నిమిత్తం భార్యతో పాటు నగారికి వచ్చాడు. తొలుత నాగోల్‌‌లోని సంతోష్ శక్తి హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో గోడౌన్ ఇన్‌ఛార్జిగా పనిచేశాడు. అక్కడ చేతివాటం చేసి గోల్‌మాల్ చేయడంతో ఉద్యోగంలో నుంచి తీసేశారు.

తర్వాత కర్మాన్‌ఘాట్‌లోని ఐశ్వర్య గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ.. క్రమేణా ఇన్‌ఛార్జి అయ్యాడు. అక్కడా అవకతవకలకు పాల్పడ్డాడని యాజమాన్యానికి అనుమానం రావడంతో వారు ఉద్యోగంలోంచి తీసేశారు. అనంతరం కర్మన్‌ఘాట్ జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు.

ఈ క్రమంలో స్థానిక తపోవన్ కాలనీలో ఉండే వివాహిత గోవూరి కీర్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ విలాసాలకు అలవాటు పడి జల్సాగా తిరడగం ప్రారంభించారు. విలాసాలకు డబ్బు సరిపోవకపోవడంతో ఇద్దరు నేరాలను అలవాటు చేసుకున్నారు.

ఒకే బైక్‌పై తిరుగుతూ ఒంటరిగా ఉన్న వృద్ధులను టార్గెట్ చేస్తూ.. కళ్లలో కారం చల్లి, కత్తితో బెదిరించి స్నాచింగ్‌కు పాల్పడేవారు. ఎల్‌బీ నగర్ ప్రాంతంలో వరుస దొంగతనాలకు పాల్పడుతుండటంతో పోలీసులు వీరి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో నిందితులిద్దరూ దొంగతనానికి రెక్కీ నిర్వహించేందుకు యాచారం వైపు వెళ్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు.

వినోద్, కీర్తిలను తనిఖీ చేయగా.. కత్తి, కారంపొడి లభించడంతో నేరాలను అంగీకరించారు. వీరిపై యాచారం, మంచాల్, సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి రూ.3 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, బైక్, ఆటో, వెయ్యి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 
 

click me!