బీఎస్పీ నేత, పటాన్‌చెరులోని ముదిరాజ్ నాయకుడు నీలం మధు కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారీ ర్యాలీతో గాంధీ భవన్‌కు వచ్చిన నీలం మధు.. పెద్ద మొత్తంలో తన అనుచరులతోపాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఇంచార్జీ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు.
Neelam Madhu: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు పేరు ప్రధాన వార్తాపత్రికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఆయన కేవలం 15 రోజుల్లోనే మూడు పార్టీలు మారడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆయన మరోసారి పార్టీ మారే విషయమై వార్తల్లోకి వచ్చారు. తాజాగా, ఆయన బీఎస్పీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బలమైన ముదిరాజ్ నేతగా పేరున్న నీలం మధు వార్డ్ మెంబర్, సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి అనుచరుడిగా కొనసాగారు. కానీ, ఆయనతో విభేదాలు రావడంతో దూరం జరిగారు. పటాన్‌చెరు అసెంబ్లీ టికెట్ తనకే కావాలని ప్రయత్నాలు చేశారు. గానీ, బీఆర్ఎస్ మహిపాల్ రెడ్డికే టికెట్ ప్రకటించారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చారు. కాంగ్రెస్‌లోనూ టికెట్ రాకపోవడంతో వెంటవెంటనే బీఎస్పీలోకి చేరారు. చివరకు బీఎస్పీ టికెట్ పైనే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇన్నాళ్లు ఆయన బీఎస్పీలోనే కొనసాగారు.
Neelam Madhu: బీఆర్ఎస్ టు కాంగ్రెస్ టు బీఎస్పీ.. పటాన్‌చెరులో ‘నీలం’ టికెట్‌పై బరిలో మధు
భారీ ర్యాలీతో గాంధీభవన్‌కు బయల్దేరిన నీలం మధు..
పటాన్‌చెరు నియోజకవర్గ నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలం మధు ఈరోజు భారీ ర్యాలీతో గాంధీభవన్‌కు బయలుదేరారు.
ఇవాళ ఆయన మళ్ళీ కాంగ్రెస్‌లో చేరనున్నారు. pic.twitter.com/AIZ9FNDzJm
తాజాగా, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టు ప్రకటించారు. ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తనతోపాటు పెద్ద ఎత్తున అనుచరులు, క్యాడర్, పటాన్‌చెరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత భారీ ర్యాలీతో గాంధీ భవన్ చేరుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో నీలం మధు హస్తం గూటికి చేరారు. అందరికీ సమన్యాయం అందించే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉన్నదని నీలం మధు అన్నారు. నీలం మధు తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.