తెలంగాణలో మూడోసారి అధికారం మాదే: ఎల్ బీ నగర్ లో కేటీఆర్

By narsimha lode  |  First Published Aug 2, 2023, 2:15 PM IST

ఈ నెల  15 నుండి  హైద్రాబాద్ లో  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను  లబ్దిదారులకు పంపిణీ చేస్తామని  మంత్రి కేటీఆర్ చెప్పారు. 


హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి  రానుందని  మంత్రి  కేటీఆర్ ధీమాను  వ్యక్తం  చేశారు. 
హైద్రాబాద్ లోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో  మంత్రి పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలోని హస్తినాపురంలో లబ్దిదారులకు  కన్వీనియన్స్ డీడ్ పత్రాలను  మంత్రి కేటీఆర్  బుధవారంనాడు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో  మంత్రి ప్రసంగించారు. పనిచేసే ప్రభుత్వాలను  ప్రజలు వదులుకోరన్నారు. అందుకే మూడోసారి తమ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టనున్నారని  కేటీఆర్  విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్  ప్రమాణం చేస్తారన్నారు.

తెలంగాణ  రాష్ట్రం సాధించడంతో పాటు  తలసరి ఆదాయంలో  రాష్ట్రం అగ్రస్థానంలో  నిలిచిందన్నారు.  ప్రభుత్వంపై  నోటికొచ్చినట్టుగా విమర్శలు చేసే పార్టీలకు బుద్దిచెప్పాలని మంత్రి  కోరారు. కేసీఆర్ వయస్సుకు  గౌరవం ఇవ్వని పార్టీలను  ఓ కంట కనిపెట్టాలన్నారు.  58, 59 జీవో ద్వారా హైద్రాబాద్ నగరంలో  లక్ష మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేస్తే  ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోనే  11 వేల మంది లబ్దిదారులున్నారని మంత్రి గుర్తు చేశారు.

Latest Videos

 హైద్రాబాద్ నగరంలో  ఈ నెల  15వ తేదీ నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను  లబ్దిదారులకు పంపిణీ చేస్తామన్నారు.  గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో  మూడు వేల కుటుంబాలకు  మూడు లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు మంత్రి. హైద్రాబాద్  వాసుల సౌకర్యార్థం  మెట్రో రైలును విస్తరించనున్నట్టుగా  కేటీఆర్  ప్రకటించారు.  మెట్రో విస్తరణ పనులకు భూసేకరణ త్వరలో ప్రారంభించనున్నామన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో  విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన  కౌంటరిచ్చారు.

 


 

tags
click me!