ఫిబ్రవరి 5న నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ..

By SumaBala BukkaFirst Published Jan 24, 2023, 9:01 AM IST
Highlights

మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఫిబ్రవరి 5న సభ నిర్వహించనున్నారు. 

హైదరాబాద్ : మహారాష్ట్రలోని నాందేడ్ లో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బిఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జాతీయ రాజకీయాల దృష్టిని మరింతగా ఆకర్షించడం..జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితిని విస్తరించడమే లక్ష్యంగా ఈ సభ జరగనుంది. ఇటీవల ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ విజయవంతం కావడంతో.. అలాంటిదే మరో సభ  రాష్ట్రం వెలుపల చేస్తే... పార్టీలో ఉత్సాహం మరింత పెరుగుతుందని  అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

గత మూడు రోజులుగా మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలు నాందేడ్ సభకు అవసరమైన ఏర్పాట్లపై ప్రగతిభవన్లో కేసీఆర్తో భేటీ అయ్యారు.  ఈ మేరకు కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నాందేడ్లో జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలని.. దీనికి అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు ఈ నాందేడ్ లో జరగబోయే బీఆర్ఎస్ బహిరంగ సభను ఈనెల 29వ తేదీన నిర్వహించాలని అనుకున్నారు. అయితే, మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. 

యువకుడితో అర్థనగ్న నృత్యాలు.. ఒళ్లంతా తడుముతూ, చెంపలు తాకుతూ ఓ రౌడీషీటర్ పైశాచికానందం.. వీడియో వైరల్..

దీంతో ఈ తేదీని ఫిబ్రవరి 5కి వాయిదా వేసినట్లు సమాచారం. మహారాష్ట్ర శాసన మండలికి ఎన్నికలు జరుగుతున్నాయి. మండలికి సంబంధించి.. రెండు పట్టభద్రుల, మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ  స్థానాలకు ఈనెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 2న ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇవేవీ సభకు అడ్డు రాకూడదన్న కారణంతోనే బిఆర్ఎస్ సభకు ఫిబ్రవరి 5ను ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణలో ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలకు 4, 5 తేదీలు శని, ఆదివారాలు బ్రేక్ రానుంది. ఇదికూడా నాందేడ్ సభకు అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన అనేకమంది ముఖ్య నేతలు నాందేడ్ సభ వేదికగా బీఆర్ఎస్ లో చేరబోతున్నారని ఆ పార్టీ వర్గాలు  తెలుపుతున్నాయి. ఇక ఈ సభ నిర్వహణ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి.. చేరికలు ఎలా ఉండబోతున్నాయి..  సభకు ఎవరిని ఆహ్వానించాలి అనేదానిమీద ఒకటి రెండు రోజుల్లో పూర్తి పిక్చర్ రానుంది.  

ఖమ్మం సభలో బీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మరో ముగ్గురు ముఖ్యమంత్రిలు, ఒక మాజీ సీఎం హాజరయ్యారు. ఈ మాదిరిగానే మహారాష్ట్రలోని నాందేడ్ లో జరగబోయే సభకు వివిధ పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యేలా చూసుకునే అవకాశం ఉంది. ఈ సభ కోసం ఫిబ్రవరి 5న కేసీఆర్ నాందేడ్ కు వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే అక్కడి గురుద్వారాను కేసీఆర్ దర్శించుకుంటారు.

మొదటిసారిగా వేరే రాష్ట్రంలో సభ నిర్వహిస్తున్నందున విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేయాలని, పర్యవేక్షణ నిర్వహించాలని నిర్ణయించారు. ఖమ్మం సభను తలపించేలా భారీగా ఏర్పాట్లు చేయాలని.. వీటిని పర్యవేక్షించే బాధ్యతలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామయ్య, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ లతో పాటు మరికొందరు నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రం కావడంతో నాందేడ్ సభకు సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ జిల్లాలు నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

click me!