
వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నది. తొలిగా ఈ పార్టీ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నిన్న కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కేసీఆర్ తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ రోజు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్‌లోని బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం ఈ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితలకు బీఆర్ఎస్ పార్టీ మరోసారి ఛాన్స్ ఇచ్చింది. వీరితోపాటు కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్,పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది.
Also Read: Prashant Kishor: బీఆర్ఎస్ గెలుస్తుందనీ చెప్పాడు.. పీకే గురి తప్పింది: వైసీపీ
నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి, మాలోతు కవిత మహబూబాబాద్ నుంచి గత లోక్ సభ ఎన్నికల్లో దాదాపు లక్షన్నర ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అంతేకాదు, లోక్ సభ ఎన్నికల కోసం క్యాంపెయినింగ్‌కూ బీఆర్ఎస్ ప్లాన్ వేసుకుంది. ఈ నెల 12వ తేదీన కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలోని గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభకు నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఈ సభలో మాట్లాడునున్నారు.