రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ.. బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు?: ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు

By Mahesh K  |  First Published Mar 11, 2024, 10:23 PM IST

రేపు సాయంత్రం కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ కరీంనగర్ నుంచి ప్రచారం మొదలు పెడతారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు.
 


కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిలవనున్నారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన కార్యక్రమం గురించి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ మైదానంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుందని తెలిపారు. ఈ సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ మాట్లాడుతారని వివరించారు. కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ కదనభేరీ ప్రారంభం అవుతుందని తెలిపారు.

ఈ భారీ సభకు పెద్ద మొత్తంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని వినోద్ కుమార్ తెలిపారు. ఈ సభతోనే కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని అన్నారు.

Latest Videos

undefined

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని, అలాంటి సందర్భంలో బీఆర్ఎస్ ఎంపీని గెలిపించాల్సిన అవసరం ఏమున్నదని కొందరు ప్రశ్నిస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. దీనికి సరైన సమాధానం తమ అధినాయకుడు కేసీఆర్ ఇస్తారని వివరించారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో తమ గళాన్ని విప్పి ఎన్నో విజయాలు సాధించారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గులాబీ నాయకులు.. గడిచిన పదేళ్లలో తెలంగాణ హక్కులను బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో కొట్లాడి సాధించారని వివరించారు. అటు, కాంగ్రెస్, ఇటు బీజేపీ.. వీటికి తెలంగాణ స్పృహ ఉండదని, తెలంగాణ మనస్సును బీఆర్ఎస్ మాత్రమే అర్థం చేసుకోగలదని పేర్కొన్నారు. కాబట్టి, తెలంగాణ స్పృహ, సోయి ఉన్న ఎంపీలు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఇప్పుడు మరింత ఎక్కువ ఉన్నదని చెప్పారు. కాబట్టి, ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాల్సిన ఆవశ్యకత మరింత ఉన్నదని వివరించారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఉంటే.. మేడిగడ్డ రిపేర్ పనులు మొదలయ్యేవని, మిడ్ మానేరు, ఎల్ఎండీ నింపుకుని పంట పొలాలకు నీళ్లు ఇచ్చేవాళ్లమని వినోద్ తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఏది అత్యవసరమో దాని గురించి ఆలోచించాలని, ఒక వైపు పంట పొలాలు ఎండిపోతుంటే.. రైతులు కంటనీరు పెట్టుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ఉంటే ఎట్లన్న చేసి నీళ్లు అందించేవాడని రైతులు అనుకుంటున్నారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలని సూచించారు.

click me!