ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చివేసినా ఎవరికీ అభ్యంతరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చివేసినా ఎవరికీ అభ్యంతరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బృందం రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కి ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినవారిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి. రవీందర్ రావు, ఎల్.రమణ, తాతా మధు, శంభిపూర్ రాజు, దండె విఠల్ ఉన్నారు.
రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయం, నివాసాన్ని గ్రైనైడ్స్ పెట్టి పేల్చి వేయాల్సిందిగా కోరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రేవంత్ ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డీజీపీని కోరారు.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. బుధవారం ములుగులో జరిగిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమవీరుల త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా రాజకీయ పదవులు అనుభవిస్తున్నారని.. త్యాగాలు చేసిన ఒక్క కుటుంబానికి కూడా ప్రయోజనం లేదని రేవంత్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌ను మావోయిస్టులు పేల్చివేసినా.. దాని వల్ల ప్రజలకు ఉపయోగం లేదు కనుక ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున పది ఎకరాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రగతి భవన్ నిర్మించారని విమర్శించారు. ప్రగతి భవన్ ఆంధ్రా పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరిచి, స్వాగతం పలుకుతోందరి ఆరోపించారు. పేదలకు మాత్రం ప్రవేశం లేదన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రగతి భవన్ ఎందుకని ప్రశ్నించారు. ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు.. బాంబులతో ప్రగతిభవన్‌ను పేల్చివేసిన ప్రజలకు ఒరిగే నష్టం ఏం లేదన్నారు.