రైతుల గురించి బీజేపీ నేతలు మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు
హైదరాబాద్: రైతు పేరు కన్పించిన పథకాలకు కేంద్రం కోతలు పెట్టిందని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలకు మంత్రి హరీష్ రావు బుధవారం నాడు సమాధానం ఇచ్చారు.
కేంద్రం ప్రభుత్వం చెప్పినట్టుగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే రాష్ట్రానికి రూ. 30 వేల కోట్లు అదనంగా వచ్చేవన్నారు. కానీ తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఈ నిధులను తీసుకోవాలనుకోలేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అనేక రాష్ట్రాలు విద్యుత్ సంస్కరణలు అమలు చేసి ఈ నిధులను తీసుకున్నాయని మంత్రి హరీష్ రావు వివరించారు.. రైతులపై తమ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను ఇంతకంటే నిదర్శనం కావాలా అని ఆయన ప్రశ్నించారు. రైతు భీమా, రైతు బంధు వంటి పథకాలను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు.
కిసాన్ అనే పేరు కన్పిస్తే చాలు కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత పెడుతుందన్నారు. .కానీ కార్పోరేట్ కంపెనీలకు 19 లక్షల కోట్లను మాఫీ చేసిందని ఆయన విమర్శించారు. తమకు అన్యాయం చేసే చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన రైతులను కార్లతో తొక్కించారని యూపీ ఘటనను మంత్రి హరీష్ రావు పరోక్షంగా ప్రస్తావించారు.
నల్లచట్టాలను వ్యతిరేకించినందుకే రైతులపై కక్ష పెట్టుకున్నారని కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. రైతులను నట్టేట ముంచిన బీజేపీ నేతలా తమకు నీతులు చెబుతారా అని ఆయన ప్రశ్నించారు.
also read:ప్రతి ఒక్కరిపై రూ. 1.39 లక్షల అప్పు: కేంద్రం అప్పులపై హరీష్ రావు
రైతు సంక్షేమం విషయంలో కేసీఆర్ సర్కార్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రపంచమే అబ్బుపడే కాశేళ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో నిర్మించిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణను చూసి కేంద్రం ప్రారంభించిన హర్ ఘర్ జల్ పథకం సవ్యంగా సాగడం లేదన్నారు. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రజలకు కావాల్సిన పవర్ ను ఇచ్చినందుకే ప్రజలు తమకు పవర్ కట్టబెట్టారని మంత్రి హరీష్ రావు చెప్పారు. బడుగు, బలహీనవర్గాల కు ఏమీ చేయలేదన్నట్టుగా విపక్షాలు మాట్లాడుతున్నాయని హరీష్ రావు విమర్శించారు.గతంలో అసెంబ్లీ సమావేశాలంటే ఖాళీ బిందెల ప్రదర్శనలుండేవన్నారు. కానీ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ కారణంగా మంచినీటి సమస్య లేదన్నారు.