MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సైబర్ కేటుగాళ్లు షాకిచ్చారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేయబడినట్టు తెలిపారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
MLC Kavitha:సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వారి సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. నకిలీ అకౌంట్లు, ఫేక్ లింక్స్ పంపించి దారుణాలకు పాల్పడుతున్నారు. అసభ్యకరమైన పోస్టు చేస్తూ బ్యాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు. ఇలా చేస్తూ ప్రభుత్వాలు, పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి కేసులను సీరియస్ తీసుకుంటున్న సైబర్ క్రైం పోలీసులు వారి ఆటకట్టిస్తూనే ఉన్నారు. అయినా వారి ఆగడాలు తగ్గడం లేదు.
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సైబర్ కేటుగాళ్లు షాకిచ్చారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ (ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్(ట్విట్టర్))హ్యాక్ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పలుసార్లు హ్యాకింగ్‌కు యత్నించారనీ, అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తనకు సంబంధంలేని పలు వీడియోను పోస్ట్ చేశారని తెలిపారు. ఈ చర్యను గమనించిన తాను వెంటనే తన అకౌంట్ హ్యాకింగ్ అయ్యినట్టు గుర్తించానని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ( @TelanganaDGP @cyberabadpolice @TSCSB) ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
గవర్నర్ తమిళిసైకు షాకిచ్చిన సైబర్ నేరగాళ్లు
ఇదిలా ఉండగా.. ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు కూడా సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. గవర్నర్ తమిళిసై అధికారిక X ఖాతా హ్యాక్ అయినట్లు తెలంగాణ పోలీసులు జనవరి 17 బుధవారం నాడు తెలియజేశారు. సంబంధిత అధికారులు ఖాతాను లాగ్ ఇన్ కాలేకపోవడంతో ఈ విషయమై.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
హ్యాకర్లు ఖాతాలో ఎలాంటి సందేశాలను పోస్ట్ చేయలేదు. కానీ, దానికి యాక్సెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. హ్యాకింగ్‌పై మైక్రోబ్లాగింగ్ సైట్ యాజమాన్యాన్ని పోలీసులు సంప్రదించినట్లు సమాచారం. నిందితులను కూడా గుర్తించే ప్రయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఇటీవల వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఫేస్ బుక్ అకౌంట్‌ను సైతం సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇతర పార్టీలకు చెందిన పోస్టులు వరుసగా పోస్టు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హ్యాకర్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.