లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా సీబీఐ చేర్చింది. 26వ తేదీన ఢిల్లీకి వచ్చి విచారణలో హాజరు కావాలని సమన్లు కూడా పంపింది.
ఆమ్ ఆద్మీ పార్టీని దారుణంగా దెబ్బ తీసిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెర మీదికి వచ్చింది. ఇప్పటి వరకు ఆమె ఈడీ ముందు కేవలం సమాచారం కోసం విచారణ హాజరయ్యారు. కానీ, ఇప్పుడు ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ కేసులో ఆమె పేరును సీబీఐ చేర్చింది. ఈ మేరకు ఆమెకు సీబీఐ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన ఆమె ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ కేసు గత ఏడాదిన్నర నానుతూ ఉన్నది. పలువురు నిందితులు అప్రూవర్లుగా మారారు. పలువురు నిందితులు, అప్రూవర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తున్నది. ఆమె ఢిల్లీకి వెళ్లి ఆఫీసులో విచారణకు హాజరైన తర్వాత.. అక్కడే ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశాలూ ఉన్నాయి.
గతంలోనూ ఆమెను ఈడీ అదుపులోకి తీసుకుంటుందనే వార్తలు సంచలనమయ్యాయి. రాత్రి వరకు ఆమెను విచారించిన సందర్భాలూ ఉన్నాయి. అప్పుడే ఆమె అరెస్టు అవుతుందని చాలా మంది భావించారు. కానీ, ఆమె విచారణకు హాజరై తిరిగి వచ్చేశారు. ఆమె ఫోన్ హ్యాండోవర్ చేశారు. అప్పుడు ఆమెను అరెస్టు చేయకపోవడం వెనుక బీఆర్ఎస్, బీజేపీల వెనుక లోపాయికారి ఒప్పందం ఉన్నదనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తోపాటు.. బీజేపీని కూడా నష్ట పరిచాయి.
Also Read : Lasya Nandita: లాస్య నందిత పాడే మోసిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు.. వీడియో వైరల్
ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఈ లిక్కర్ పాలసీ కేసులో కవిత పేరు ప్రముఖంగా ముందుకు వచ్చింది. అదీగాక, మరోసారి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం ఉన్నదని, అవి రెండు పొత్తు పెట్టుకునే అవకాశమూ ఉన్నదనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సారి సీబీఐ విచారణకు ప్రాధాన్యత చోటుచేసుకుంది.