24న కాదు రేపే నా పిటిషన్ విచారించండి .. శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు, వ్యూహాత్మకంగా కవిత

By Siva KodatiFirst Published Mar 16, 2023, 8:40 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనకు మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రేపు సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయనున్నారు. 
 

రేపు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ నెల 20 విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వడంతో .. తన అత్యవసర పిటిషన్‌ను విచారించాలని సుప్రీంను కోరనున్నారు కవిత . ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి కవిత తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేయనున్నారు. ఈడీ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని తనకు ఇచ్చిన నోటీసులు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత తన పిటిషన్‌లో పేర్కొననున్నారు. ఈడీ విచారణకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపిన సంగతి తెలిసిందే.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఇవాళ  విచారణకు  హాజరు కాలేనని  చివరి నిమిషంలో  ఈడీకి  కవిత  సమాచారం పంపడంలో  వ్యూహత్మకంగా  వ్యవహరించిందనే  అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మహిళలను  విచారించే  సమయంలో  తన హక్కులను చూపి  కవిత  విచారణకు గైర్హాజరయ్యారు. అయితే దీనిపై స్పందించిన ఈడీ ఈ నెల 20వ తేదీన విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది. తొలుత ఈ నెల 11న కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో 9 గంటలకు పైగా కవితను విచారించిన ఈడీ అధికారులు.. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. ఈ నేపథ్యంలోనే కవిత నేడు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలోనే తన తండ్రి,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఉన్న కవిత.. విచారణకు గైర్హాజరు అయ్యారు. 

ALso REad: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌: 20వ తేదీన విచారణకు రండి.. ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు

ఈ క్రమంలోనే కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 24కి సుప్రీంకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా కవిత లేఖలో ప్రస్తావించారు. తాను వ్యక్తిగతంగా రావాలని సమన్లలోని ఎక్కడ పేర్కొనలేదని.. తన ప్రతినిధిగా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపుతున్నానని చెప్పారు. సమన్లలో అడిగిన వివవరాలను కూడా భరత్ ద్వారా పంపుతున్నానని చెప్పారు. 

ఈ క్రమంలోనే ఈడీ కార్యాలయానికి చేరుకున్న బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ మాట్లాడుతూ.. కవిత ఈరోజు ఈడీ ఎదుట హాజరుకావడం లేదని చెప్పారు. ఆమెను ఈడీ కార్యాలయానికి పిలిపించడం చట్టవిరుద్ధమని అన్నారు. మార్చి 24న సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే హాజరవుతారని పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా చూపి కవిత విచారణకు హాజరుకావడం లేదనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. 
 

click me!