ఢిల్లీ లిక్కర్ స్కాం: న్యాయ నిపుణులతో కవిత భేటీ

By narsimha lodeFirst Published Mar 21, 2023, 9:34 AM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  మంగళవారంనాడు  ఈడీ విచారణకు హాజరుకానున్నారు.  ఈడీ విచారణకు  హాజరయ్యే  ముందు  కవిత  న్యాయ నిపుణులతో  చర్చిస్తున్నారు.

హైదరాబాద్:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారంనాడు  న్యాయ నిపుణులతో  చర్చిస్తున్నారు.  సుప్రీంకోర్టు  సీనియర్ కౌన్సిల్  రాకేష్ చౌదరితో  కవిత  భేటీ అయ్యారు. ఈడీ విచారణకు  హాజరయ్యే  ముందు  కవిత మీడియా తో  మాట్లాడే అవకాశం ఉంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో   బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఈ నెల  20వ తేదీన  ఈడీ విచారణకు హాజరయ్యారు.  నిన్న  సుమారు  పదిన్నర గంటల పాటు  ఈడీ అధికారులు  కవితను  ప్రశ్నించారు. ఇవాళ కూడ  విచారణకు  రావాలని కవితను ఈడీ  అధికారులు  ఆదేశించారు. దీంతో  ఇవాళ  ఉదయం 11 గంటలకు  కవిత  ఈడీ విచారణకు  హాజరు కానున్నారు. ఈడీ విచారణకు  హజరు కావడానికి  ముందు   న్యాయ నిపుణుల సలహాలను  కవిత తీసుకుంటున్నారు.  ఈ మేరకు  కవిత  న్యాయ నిపుణులతో  సమావేశమయ్యారు.  ఇవాళ  ఈడీ అధికారుల  ప్రశ్నలను  ఏ రకంగా  ఎదుర్కోవాలనే దానిపై కవిత  న్యాయ నిపుణులతో  చర్చిస్తున్నారని  సమాచారం.  

2021 సెప్టెంబర్  నుండి ఆగష్టు  2022 వరకు  కవిత 10 ఫోన్లు వాడినట్టుగా ఈడీ అభియోగం.ఈ ఫోన్లను  కవిత  ధ్వంసం  చేసిందని ఈడీ ఆరోపణలు చేసింది. ఈడీ చేసిన ఆరోపణలపై  కవిత  సమాధానం చెప్పే అవకాశం ఉంది.  ఈడీ విచారణకు హాజరయ్యే ముందు  మీడియా సమావేశంలో  కవిత  తన ఫోన్లను  చూపనున్నారని  సమాచారం.  

also read:డిల్లీ లిక్కర్ స్కాం: ముగిసిన విచారణ, రేపు కూడా కవితను విచారించనున్న ఈడీ

ఈ నెల  11వ తేదీన తొలిసారిగా  కవిత  ఈడీ విచారణకు  హాజరయ్యారు. నిన్న  రెండో దఫా  కవిత  ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.  ఇవాళ మరోసారి ఈడీ  విచారణకు  వెళ్లనున్నారు. ఈ నెల  6వ తేదీ  రాత్రి అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అధికారులు  అరెస్ట్  చేశారు. అరుణ్ రామచంద్రపిళ్లై  ఇచ్చిన వాంగ్మూలంలో  కవిత  పేరు ప్రస్తావనకు  వచ్చింది.  కవిత  ప్రతినిధిగా  తాను వ్యవహరించినట్టుగా  అరుణ్ రామచంద్రపిళ్లై  ఈడీకి స్టేట్ మెంట్  ఇచ్చారు.ఈ స్టేట్ మెంట్  ను  ఈడీ అధికారులకు  కోర్టుకు  సమర్పించారు.  తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకొనేందుకు  అరుణ్ రామచంద్రపిళ్లై  కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  మరో వైపు ఈడీ కార్యాలయం వద్ద  భారీగా పోలీసులను మోహరించారు. మహిళా పోలీసులను కూడా ఈడీ కార్యాలయం వద్ద  బందోబస్తు ఏర్పాటు  చేశారు.
 

click me!