బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
హైదరాబాద్::బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నాడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ సాయంత్రం బంజారాహిల్స్ నివాసం నుండి ఆమె ఢిల్లీకి బయలుదేరారు. తన నివాసం నుండి ప్రగతి భన్ కు వెళ్తారని భావించారు. కానీ ఆమె ప్రగతి భవన్ కు వెళ్లకుండా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.
నిర్ణీత షెడ్యూల్ మేరకు ఇవాళ సాయంత్రం కవిత ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే ఈడీ నుండి స్పందన కోసం ఇవాళ సాయంత్రం వరకు కవిత ఎదురు చూశారు. కానీ ఈడీ నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తన నిర్ణీత షెడ్యూల్ మేరకు కార్యక్రమాలను కొనసాగించాలని కవిత నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి ధర్నాలో పాల్గొనేందుకు కవిత ఇవాళ ఢిల్లీకి వెళ్లినట్టుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష నిర్వహించనున్నారు.ఈ దీక్షలో పలు పార్టీల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కారణంగా ఢిల్లీకి వెళ్తున్నట్టుగా కవిత తన సన్నిహితులకు చెప్పినట్టుగా సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఈడీ ఇచ్చిన నోటీసులపై కవిత కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడింది . ఢిల్లీ బయలురేరే ముందు కేసీఆర్ తో కవిత ఫోన్ లో మాట్లాడిందని సమాచారం. నీ కార్యక్రమం కొనసాగించాలని కేసీఆర్ కవితకు చెప్పారని తెలుస్తుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేసీఆర్ కవితకు ధైర్యం చెప్పారు. న్యాయపరంగా బీజేపీ అకృత్యాలపై పోరాటం చేద్దామని కేసీఆర్ కవితకు తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ కవిత కు భరోసా ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు కవితకు ఇవాళ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. విచారణకు రేపు రాలేనని కవిత ఈడీ అధికారులకు చెప్పారు. ఈ నెల 15వ తేదీ తర్వాత విచారణకు అందుబాటులో ఉంటానని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారంగా విచారణకు హాజరు కాలేనని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎల్లుండి జంతర్ మంతర్ వద్ద ధర్నా ఏర్పాట్ల విషయమై ఢిల్లీలో ఉండాలని కవిత షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ సాయంత్రం ఆరు గంటల విమానానికి కవిత ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు విచారణకు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని కవితకు ఈడీ అధికారులు కోరితే కవిత ఏం చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.