
మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన పోరాటాన్ని తాను ముందుకు తీసుకెళ్తానన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్వహించిన కార్యక్రమంలో కవిత పాల్గొని ప్రసంగించారు. తోటి మహిళలకు ఏదైపనా చేయడాన్ని బాధ్యతగాతీసుకోవాలని ఆమె సూచించారు. మనదేశంలో అసమానతలు ఇంకా అలాగే వున్నాయని.. సమానత్వం ఇంకా రాలేదని కవిత పేర్కొన్నారు. పురుషులకు ఇచ్చే జీతాలతో సమానంగా .. మహిళా విద్యార్ధులంతా ఆయా కంపెనీలు ఇచ్చే వేతనాలను అధ్యయనం చేయాలని ఆమె సూచించారు. చదువుకుని ఉద్యోగం చేయడం ఇప్పుడు పాతదని.. పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కవిత పిలుపునిచ్చారు.
నేటి తరంలో అందుబాటులో వున్న సాంకేతికత, అవకాశాల నేపథ్యంలో .. పట్టుదల, కృషి వుంటే చాలని డబ్బు వెతుక్కుంటూ వస్తుందని కవిత స్పష్టం చేశారు. మీ దగ్గర ఆలోచనలుంటే ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా వుందని ఆమె పేర్కొన్నారు. టీ వర్క్స్, టీ హబ్ వంటివి అండగా వుంటాయని కవిత స్పష్టం చేశారు. ఆడపిల్లలు స్మార్ట్‌గా వుండటమే కాదని, స్మార్ట్‌ఫోన్‌లా వుండాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. జీవితంలోకి నెగిటివ్ వ్యక్తులను రానివ్వకూడదని.. సోషల్ మీడియాలో మనల్ని ఎవరైనా వేధిస్తే, వారి ఖాతాలను తొలగించే విధానం అందుబాటులోకి రావాలని కవిత ఆకాంక్షించారు.
Also REad: ఢిల్లీ లిక్కర్ స్కాం .. రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరు , ఆమెకు అతను బినామీ అన్న ఈడీ
ఇదిలావుండగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇవాళ అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. అరుణ్ రామచంద్రపిళ్లై కవిత బినామీ అని ఆరోపించిన ఈడీ.. ఆమె చెప్పినట్లు పిళ్లై నడుచుకున్నాడని పేర్కొంది. తాను కవిత ప్రతినిధినని అరుణ్ అనేకమార్లు స్టేట్‌మెంట్ ఇచ్చాడని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్ స్థాపనలో పిళ్లై కీలకపాత్ర పోషించాడని.. అలాగే కాగితాలపై 3.5 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు చూపారని ఈడీ పేర్కొంది.
మొదటి నుంచి అరుణ్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ గురించి అరుణ్ రామచంద్రపిళ్లై, కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ముందే తెలుసునని ఈడీ పేర్కొంది. అలాగే సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించినట్లు పిళ్లై విచారణలో చెప్పాడని ఈడీ తెలిపింది. ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్‌లో ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ తమకు దొరికిందని ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాంలో హవాలా కోణానికి సంబంధించి పిళ్లైని ప్రశ్నించాలని ఈడీ తన రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించింది.