కులం పేరు మార్చుకుని రాజకీయాలు.. హైదరాబాద్‌లో వుంటూ నాపై కుట్రలా : సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 02, 2023, 02:39 PM IST
కులం పేరు మార్చుకుని రాజకీయాలు.. హైదరాబాద్‌లో వుంటూ నాపై కుట్రలా : సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యలు

సారాంశం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక నాయకుడు హైదరాబాద్‌లో వుంటూ తనపై కుట్రలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మాట్లాడాలని సండ్ర సవాల్ విసిరారు. 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం ఒకటి అయితే మరో కులం పేరు చెప్పుకునే వాళ్ల మాదిరిగా తాను రాజకీయాలు చెయ్యడం లేదన్నారు. తనకు ఎలాంటి దురలావాట్లు లేవని, తాను వాళ్ల మాదిరి కులాల పేర్లు మార్చుకుని రాజకీయాలు చేయడం లేదని వీరయ్య తేల్చిచెప్పారు. ఓ సామాజిక వర్గాన్ని తాను దూరం పెడుతున్నానని.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో వుంటూ ఓ వ్యక్తి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని... దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మాట్లాడాలని సండ్ర వెంకట వీరయ్య సవాల్ విసిరారు. 

కాగా.. ఇటీవల తెలంగాణ ఎస్సీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడవటం సండ్ర వెంకట వీరయ్యకు అలవాటైందని, బీఆర్ఎస్‌లోనైనా వుంటారన్న గ్యారెంటీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. సత్తుపల్లిలో ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, దీనిని చూసి సండ్రకు నిద్రపట్టడం లేదని పిడమర్తి రవి ఎద్దేవా చేశారు. భూమి కోసం బీఆర్ఎస్‌లో చేరారని ఆయన ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సండ్ర వెంకట వీరయ్య వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని పిడమర్తి రవి అన్నారు. తాము కూడా వ్యక్తిగతంగా తీసుకుంటే సండ్ర తట్టుకోలేరని ఆయన హెచ్చరించారు. త్వరలోనే ఎమ్మెల్యే అక్రమాలను బయటపెడతామని.. సండ్ర పార్టీలు మారే ఊసరవెల్లి అంటూ పిడమర్తి ఆరోపించారు. 

Also REad: వంద కోట్లు ఇస్తానని.. హుండీలో రూ.100 కూడా వేయలేదు, ఇది రామయ్యపై భక్తి : కేసీఆర్‌పై పొంగులేటి ఆగ్రహం

ఇకపోతే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి భగ్గుమన్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొద్దిరోజుల క్రితం భద్రాచలం నియోజకవర్గంలోని తన వర్గీయులతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భద్రాచలం అభివృద్ధికి వంద కోట్లు ఇస్తామని చెప్పిన సీఎం కనీసం రూ.100 కూడా హుండీలో వేయలేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఒకే ఒక్కసారి రాముల వారికి తలంబ్రాలు తీసుకొచ్చారని.. రాముడు మీద కేసీఆర్‌కు వున్న గౌరవం అది అంటూ శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. పోడు భూముల్లో గిరిజనులకు ఒక్క ఎకరం కూడా పట్టా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు డబుల్ బెడ్ రూం ఇళ్లు గుర్తుకొస్తాయన్నారు.

కొందరి స్వార్థం వల్ల పోటీ పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని.. విద్యార్ధులకు అన్యాయం జరిగినా కమీషన్ సభ్యులను ఎందుకు బర్తరఫ్ చేయలేదని పొంగులేటి ప్రశ్నించారు. మంత్రుల పీఏలు, కొందరు అధికారులపైనా ఆరోపణలు వచ్చాయని.. వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిలదీశారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసిన విద్యార్ధులకు లక్ష చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై సిట్‌తో కాకుండా సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ఏదైనా సరే.. కేసీఆర్ గద్దె దించడమే తన లక్ష్యమని.. త్వరలోనే ఏ పార్టీలో చేరే అంశంపై నిర్ణయం ప్రకటిస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అభిమానుల కోరిక మేరకే నిర్ణయం వుంటుందని ఆయన స్పష్టం చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu