
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేర్యాలలో చెరువు శిఖం భూమిని తాను కబ్జా చేశానని అంగీకరించారు. తన కూతురు ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నట్టుగా చెప్పారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తన సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ తండ్రిపైనే తుల్జా భవానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువు భూమిని తన తండ్రి కబ్జా చేశారని ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన మత్తడి భూమిని చేర్యాల మున్సిపాలిటికీకి అప్పగించినున్నట్టుగా గత ఆదివారం ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా చేర్యాల చెరువు శిఖం భూమిని తాను కబ్జా చేసినట్టుగా ముత్తిరెడ్డి యాదగిరి అంగీకరించడం సంచలనంగా మారింది. అయతే ప్రజా సేవ కోసమే తాను భూమిని కబ్జా చేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. తన కూతురు భూమిని తిరిగి మున్సిపాలిటీకి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. తన కూతురిని అడ్డుపెట్టుకుని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడపడితే అక్కడ వెంచర్లు వేసిన ప్రతాప్ రెడ్డి 20వేల గజాల స్థలల్ని కబ్జా చేశారని ఆరోపించారు. దమ్ముంటే 20 వేల గజాల స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించాలని సవాలు విసిరారు. తాను ప్రజల నోట్ల మట్టి కొట్టేందుకు భూమిని కబ్జా చేయలేదని చెప్పారు.
ఇక, తన కూతురు, అల్లుడు అమాయకులని, వాళ్లను తన రాజకీయ ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తనను ప్రత్యక్షంగా ఎదుర్కొలేకే.. తన ప్రత్యర్థులు కుట్రలకు తెరలేపారని విమర్శించారు.