సీఎం రేవంత్ రెడ్డి చేసిన ల్యాండ్ క్రూయిజర్ల ఆరోపణలపై బీఆర్ఎస్ స్పందించింది. 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేస్తే తప్పేమున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వినియోగానికే కదా అని అన్నారు. అందులో ఏదైనా అవినీతి జరిగిందా? అని ఎదురు ప్రశ్నించారు.
Kadiyam Srihari: సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ల్యాండ్ క్రూయిజర్ కార్లను పేర్కొంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ పగటి కలలు కన్నాడని, అందుకోసమే ఆయన పరివారం కోసం 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచిపెట్టాడని అన్నారు. ఒక్కో కారు రూ. 3 కోట్లు అని తెలిపారు. కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశాడని ఫైర్ అయ్యారు. తాను తనకు కాన్వాయ్ అక్కర్లేదని చెప్పానని, కానీ, కేసీఆర్ మాత్రం ఖరీదైన కాన్వాయ్‌ను సిద్ధం చేసుకున్నాడని ఆరోపించారు. తాను సీఎంగా బాధ్యతలు తీసుకున్న 10 రోజుల తర్వాత ఈ విషయం తెలిసిందని వివరించారు. రెండు రోజులపాటు ల్యాండ్ క్రూయిజర్ల టాపిక్ రాష్ట్రంలో హాట్ హాట్‌గా మారింది. తాజాగా, బీఆర్ఎస్ ఆయన ఆరోపణలపై రియాక్ట్ అయింది.
బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. కొత్తగా 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేస్తే తప్పేమున్నదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వినియోగం కోసమే కదా? అని అన్నారు. అందులో ఏమైనా అవినీతి జరిగిందా? అని ప్రశ్నించారు.
Also Read: Miracle: 40 నిమిషాలు మరణించి లేచింది.. చావు అనుభవాలను ఇలా చెప్పింది..!
కాంగ్రెస్ ప్రభుత్వమే అలవిగాని హామీలతో ప్రజలను మభ్య పెట్టిందని అన్నారు. ప్రగతి భవన్‌ను ఆసుపత్రి చేస్తామని అన్నదని, కానీ, ఇప్పుడు ఎవరు ఉంటున్నారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ఆర్థిక వనరులను సమకూర్చుకోలేక జనాన్ని మోసం చేస్తున్నదని ఆరోపించారు. అందుకే ఈ ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెరలేపిందని ఫైర్ అయ్యారు.