నేను ఎవరిపై దాడి చేయలేదు.. రోడ్డు నిర్మాణం పూర్తికాకముందే టోల్ వసూలు చేస్తున్నారు: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

By Sumanth KanukulaFirst Published Jan 4, 2023, 12:50 PM IST
Highlights

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు. 

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు. తాను ఎవరిపై దాడి చేయలేదని తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తికాకుండానే టోల్ వసూలు చేయడంపై ప్రశ్నించానని చెప్పారు. టోల్ సిబ్బంది ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని అన్నారు. 

మందమర్రి టోల్ ప్లాజా వద్ద మేనేజర్ ఎవరిని మాత్రమే తాను అక్కడి వారిని అడిగానని చెప్పారు. 20 కి.మీ దూరంలో ఉన్న జిల్లా  కేంద్రం పోవాలంటే.. రూ. 150 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేశాకే టోల్ వసూలు చేయాలని కోరారు. 

ఇదిలా ఉంటే.. ఎన్‌హెచ్ 363 మంచిర్యాల నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ వరకు ఏర్పాటైంది. గత కొద్ది రోజుల నుంచి ఈ మార్గంలో టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే ఈ రహదారిపై మందమర్రి వద్ద ఉన్న టోల్ ప్లాజ్‌ సిబ్బందితో మంగళవారం రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీసీటీవీ వీడియో క్లిప్‌లో.. చిన్నయ్య టోల్ ప్లాజా సిబ్బందిని చెంపదెబ్బ కొట్టడం కనిపించింది.  అయితే ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. 

సీసీటీవీ వీడియో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే చిన్నయ్య తీరు పలువురు విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రోడ్డు నిర్మాణ పనులు 100 శాతం పూర్తికాకముందే టోల్‌ప్లాజాలో రుసుము వసూలు చేయకుండా నిరోధించడంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా విఫలమైందని ఆరోపిస్తున్నారు. 

click me!