తెలంగాణను మరో బీహార్, యూపీలాగా చేసేందుకు కుట్ర.. బండి సంజయ్ కు అంతా తెలుసు.. గంగుల

By SumaBala BukkaFirst Published Apr 5, 2023, 11:08 AM IST
Highlights

బండి సంజయ్ కు తెలిసే పదో తరగతి పేపర్ లీకేజ్ జరిగిందని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపణలు గుప్పించారు. 

కరీంనగర్ : బండి సంజయ్ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మంగళవారం అర్థరాత్రి ఆయనను కరీంనగర్ లోని స్వగృహంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అక్కడినుంచి యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పీఎస్ కు తరలించారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. బీఆర్ఎస్ మీద ఆరోపణలు గుప్పిస్తూ.. అక్రమ అరెస్ట్ అంటూ నిరసనలు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా దీనిమీద ఎదురు దాడికి దిగుతున్నారు. పదో తరగతి పరీక్షల లీకేజీలో బండి సంజయ్ పాత్ర ఉందని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  

తాజాగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. బండి సంజయ్ కు తెలిసే టెన్త్ పేపర్ లీక్ అయ్యిందని సంచలన ఆరోపణలు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ నిందితుడైన ప్రశాంత్ తో బండి సంజయ్ కు దగ్గరి సంబంధాలున్నాయని తెలిపారు. ఏదో వాట్సప్ లో వచ్చిందని అంటున్నారు.. మరి మాకూ ఇన్ని గ్రూపులు.. ఇంతమంది కాంటాక్టులు ఉన్నాయి. మరి మాకు ఏ గ్రూపులోనూ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇది బండి సంజయ్ కుట్రలో భాగం కాకుంటే.. పేపర్ లీక్ విషయం తెలియగానే పోలీసులకు సమాచారం ఎందుకివ్వలేదు అని ప్రశ్నించారు. 

బండి సంజయ్‌పై కుట్ర కేసు.. బొమ్మలరామారం పీఎస్ నుంచి వరంగల్‌కు తరలింపు..!

ఉత్తరాది సంస్కృతిని ఇక్కడికి ఎందుకు తెస్తున్నారు అని బండి సంజయ్ మీద మండిపడ్డారు. మా మీద కోపం ఉంటే మాతో చూసుకోండి అంతేకానీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దన్నారు. తెలంగాణను మరో బీహార్, యూపీ లాగా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు గుప్పించారు. అంతకు ముందు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా బండి సంజయ్ మీద ఆరోపణలు చేశారు. పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయద్దని కోరారు. ఒకటో తరగతి పేపర్ కూడా లీక్ చేయడానికి వెనకాడరని అన్నారు. 

ఇదిలా ఉండగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ జ్యోతినగర్ లోని బండి సంజయ్ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు  బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసు వాహనంలో యాదాద్రి జిల్లా, బొమ్మలరామారం పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాల సమయంలో కరీంనగర్ లోని బండి సంజయ్ అత్తగారింట్లోకి కరీంనగర్ ఏసిపి తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు.

బండి సంజయ్ అత్తగారు ఇటీవల మరణించారు. బుధవారం నాడు  తొమ్మిది రోజుల కార్యక్రమానికి  ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పాల్గొనడానికి బండి సంజయ్ కరీంనగర్ లోని జ్యోతి నగర్ కు వచ్చారు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.  బండిసంజయ్ ను కలిసి తమతో పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా కోరారు. తనను ఏ కేసులో తీసుకువెళ్తున్నారు? ఎందుకు  రావాలి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇంట్లో నుంచి కదలనని  మొండికేశారు. ఈ క్రమంలోనే పోలీసులు బండి సంజయ్ కు సమాధానం చెబుతూ తమకు అతనిని అరెస్టు చేసి అధికారం ఉంటుందని.. విషయం ఏంటో పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక చెబుతామని అన్నారు. బలవంతంగా సంజయ్ ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. 

click me!