ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్.. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని.. ఏ పార్టీలో చేరనున్నారంటే..

By Sumanth Kanukula  |  First Published Oct 15, 2023, 12:45 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు. కొంతకాలంగా బీఆర్ఎస్‌ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న లక్ష్మీనారాయణ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన బాలసాని లక్ష్మీనారాయణ.. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు లక్ష్మీనారాయణ ఇంటికి కాంగ్రెస్ నేతలు పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వెళ్లనున్నారు. లక్ష్మీనారాయణను కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించనున్నారు.  వారి సమక్షంలో లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టుగా తెలుస్తోంది.

ఇక, భద్రాచలం బీఆర్ఎస్‌లో కొంతకాలంగా వర్గపోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తైన తర్వాత మరోసారి తనకు అదే పదవి దక్కుతుందని బాలసాని లక్ష్మీనారాయణ ఆశించారు. అయితే తాతా మధుకు ఎమ్మెల్సీగా అవకాశం  దక్కింది. అంతేకాకుండా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా తాతా మధుకే అప్పగించారు. మరోవైపు భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావును ప్రకటించారు. అయితే తన అనుచరుడికి భద్రాచలం టికెట్ కోసం బాలసాని లక్ష్మీనారాయణ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. అయితే భద్రాచలం నియోజకవర్గ పార్టీ ప్రచార సమన్వయ బాధ్యతలను తొలుతు లక్ష్మీనారాయణకు అప్పగించారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో బాలసాని లక్ష్మీనారాయణను ఆ బాధ్యతల నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను తాతా మధుకే కట్టబెట్టారు.

Latest Videos

ఇలా వరుస పరిణామాలతో బాలసాని లక్ష్మీనారాయణ తీవ్ర అసంతప్తికి గురయ్యారు. దీంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బాలసానితో చర్చలు జరిపారు. బీఆర్ఎస్‌లో ఉండాలని సూచించారు. అయినప్పటికీ.. పార్టీలో సముచిత స్థానం లేదనే నిర్ణయానికి వచ్చిన బాలసాని లక్ష్మీనారాయణ.. తాజాగా రాజీనామా చేశారు. 
 

click me!